CM YS Jagan: ఏపీలో మరో తొమ్మిది రోజుల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయిస్తాయని.. వైసీపీకి ఓటేస్తేనే పథకాల కొనసాగింపు అని.. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు అని సీఎం జగన్ అన్నారు.చిత్తూరు జిల్లా పలమనేరు ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే కొండచిలువ నోట్లో తలపెట్టినట్లేనన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుందని ఎద్దేవా చేశారు. 2 లక్షల 70 వేల కోట్లాది రూపాయలు బటన్ నొక్కి నేరుగా రాష్ట్ర ప్రజలకు అకౌంట్‌లో వేశానని సీఎం చెప్పారు. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం అందించామని.. 59 నెలల్లోనే 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పథకాలు అమలు చేశామన్నారు. నేరుగా ఇంటి వద్దకే పథకాలు ఇచ్చామన్నారు. ఒక్క పేదవాడికైనా చంద్రబాబు ఒక్క మంచిపని అయినా చేశాడా.. చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు అబద్దాలు, మోసాలతో వస్తున్నాడని సీఎం జగన్ దుయ్యబట్టారు.
Read Also: Pawan Kalyan: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై పవన్ కళ్యాణ్ కామెంట్స్
మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చామన్నారు. పిల్లల చదువులు కోసం అమ్మఒడితో ప్రోత్సహిస్తున్నామని.. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామన్నారు.. మహిళల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించామని సీఎం జగన్ పేర్కొన్నారు. రైతన్నల కోసం ఆర్‌బీకే వ్యవస్థ పనిచేస్తోందన్న సీఎం జగన్… ఏ గ్రామానికి వెళ్లిన గ్రామ సచివాలయం కనిపిస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచామన్నారు.
‘‘రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?. ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?. ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?. అర్హులకు 3 సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?. రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నాడు.. చేశాడా?. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానన్నాడు.. చేశాడా?. సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?. ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చడా?. మళ్లీ ఈ మోసగాళ్లు సూపర్ సిక్స్, సెవెన్ అంటున్నారు. కేజీ బంగారం, బెంజ్‌కారు ఇస్తాననంటారు.. నమ్ముతారా?’’ అంటూ చంద్రబాబుపై ప్రశ్నలు వర్షం కురిపించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.