CM YS Jagan: చంద్రబాబు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. పెత్తందారులకు ,పేదలకు మధ్య యుద్ధం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇంటింటికి వెళ్లి పేదలకు పెన్షన్లు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థను ఆపేశాడని.. తనకు మంచి పేరు వస్తుందన్న ఆలోచనతో చంద్రబాబు పెన్షన్లు అందకుండా చేస్తున్నాడని విమర్శించారు. అవ్వ తాతల ఉసురు పోసుకుంటున్నాడన్నారు.
Read Also: Kesineni Swetha: కేశినేని నాని బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయం..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌లు భూములు కొనుక్కున్నారని.. వాళ్ళందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్‌లు ఇచ్చామా, లేదంటే జిరాక్స్ కాపీలు ఇచ్చామా అంటూ ప్రశ్నించారు. 2014లో కూటమి మేనిఫెస్టో పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేశారని.. అప్పుడు అమలు చేయలేని హామీలు, ఇప్పుడు మళ్లీ అమలు చేస్తామని చెప్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు సూపర్ సిక్స్ అంటున్నారని, ఇంటికి ఓ బెంజ్ కారు, కేజీ బంగారం ఇస్తామంటున్నారని సీఎం ఎద్దేవా చేశారు. కానీ చంద్రబాబు మాటలు నమ్మొద్దన్నారు. వాలంటీర్ వ్యవస్థ నిలబడాలన్నా, అవ్వతాతలకు ఇంటికే పెన్షన్ రావాలన్నా , అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పడాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, విద్యా వైద్య రంగాలు బాగుపడాలన్నా.. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు, ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలని సీఎం జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ ఇంటికి మంచి చేసిన ఫ్యాన్‌ను ఇంట్లో ఉంచాలని.. మీకు చెడు చేసిన సైకిల్‌ను ఇంటి బయటపడేయాలని.. తాగి వాడేసిన గ్లాసును సింక్‌లో వేయాలని ప్రజలను సీఎం జగన్ కోరారు.