CM YS Jagan: వైయస్సార్ పేరు లేకుండా చేస్తున్న ఇలాంటి వారా? వైఎస్సార్ వారసులు? అంటూ పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు సీఎం వైఎస్ జగన్.. కడపలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ మరణానంతరం ఆయన పేరును చార్జిషీట్‌లో పెట్టిన పార్టీ.. నన్ను 16 నెలలు జైల్లో పెట్టిన పార్టీ.. చార్జిషీట్ లో మనమే ఆ పేరు పెట్టించామట.. ఎంతటి దుర్మార్గంగా ఆరోపణలు చేస్తున్నారో చూడండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, మరో మూడు రోజుల్లో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా..? అని తన ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం.. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్నది ఎన్నికలు మాత్రమే కాదు.. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు… ఇంటింటికి అభివృద్ధి పేదవాడి భవిష్యత్తుకు భరోసా వస్తుంది.. చంద్రబాబుకి ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్లీ మోసపోవడమే.. చంద్రబాబు నాయుడుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తలపెట్టినట్లే అని దుయ్యబట్టారు.
రంగురంగుల పేపర్లతో ప్రజలకు అబద్ధాలు చెబుతూ ఇచ్చే మ్యానిఫెస్టోకు చమరిగీతం పాడాం.. ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం 99శాతం అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వందే అన్నారు సీఎం వైఎస్ జగన్.. వైసీపీ రాకమునువు రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు ఉంటే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చింది.. లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాలోకి నిధులు జమ చేశాం.. గతంలో ఎప్పుడైనా చూసారా …? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం.. 8వ తరగతి నుంచి పిల్లల చేతులలో ట్యాబ్‌లు.. ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే ఐబీ దాకా బోధన మొదలవుతోంది… ఏ తల్లిదండ్రి తమ పిల్లల చదువులు కోసం అప్పులపాలు కాకూడదని ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పించాం అన్నారు. పేదవాడి భవిష్యత్తు కోసం ఏమి చేయాలని ఆలోచిస్తూ పథకాలు అమలు చేసాం… చంద్రబాబు రాజకీయాల్లో ఊసరవెల్లి రాజకీయాలు కనిపిస్తున్నాయి.. చంద్రబాబు ముదిరిపోయిన తొండ అని విమర్శించారు.
నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పిన బీజేపీతో జతకట్టిన వ్యక్తి చంద్రబాబు.. రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న ఎన్డీఏతో కొనసాగుతాడట.. ఆరు నూరైనా మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే అన్నారు సీఎం జగన్.. అయితే, ఈ విషయాన్ని చంద్రబాబు.. మోడీ ఎదుట ఇలా చెప్పగలరా? అని ప్రశ్నించారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ రద్దు చేస్తామని ఎన్డీఏ చెబుతున్నా.. ఎందుకు చంద్రబాబు ఇంకా ఎన్డీఏలో కొనసాగుతున్నాడు…? నాలుగు శాతం రిజర్వేషన్లు మతం పరంగా ఇచ్చినవి కాదు..! వెనుకబాటు ప్రాతిపదికగా మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చినవి.. రాజకీయం కోసం మైనార్టీల జీవితాలతో చలగాట ఆడటం న్యాయమేనా..? అని నిలదీశారు. సీఏఏ, ఎన్‌ఆర్సీ రిజర్వేషన్ల గురించి ఏ అంశాలలో అయిన మైనార్టీలకు అండగా ఉంటాం… నలుగురి మైనార్టీలకు ఎమ్మెల్సీలుగా, నలుగురు ఎమ్మెల్యేలుగా, ఒక మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ మహిళకు డిప్యూటీ శాసన మండలి చైర్మన్ ఇచ్చింది వైసీపీనే అన్నారు. మైనార్టీలకు నాలుగు శాతం పొలిటికల్ రిజర్వేషన్ కల్పిస్తూ ఏడు మంది మైనార్టీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాం అని గుర్తుచేశారు. నాన్న చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంత ఇబ్బంది పెట్టిందో మీ అందరికీ తెలుసు.. ఇదే కడప గడ్డ నుంచి ఇండిపెండెంట్‌గా 14 రోజుల్లో గుర్తు కూడా లేని సమయంలో మీరు ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది.. కడప నుంచి మీ బిడ్డకు 5 లక్షల 40 వేల మెజార్టీ ఇచ్చారని గుర్తుచేశారు సీఎం జగన్.. నోట కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో, రాష్ట్ర విభజన చేసిన దుర్మార్గులతో ప్రజల జతకట్టాలా? అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి జగన్.