CM YS Jagan: అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పటికే ‘సిద్ధం’ సభలతో ప్రచారంలో దూకుడు పెంచిన జగన్.. ఇప్పుడు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు రెడీ అవుతున్నారు.. అందులో భాగంగా రేపు వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యనేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్‌లో ఈ మీటింగ్ నిర్వహించనున్నారు.. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతల హాజరు కానున్నారు. సుమారు 2 వేలకు పైగా మండల స్థాయి నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.. వై నాట్ 175 లక్ష్యంగా నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించాలని నేతలకు సూచించనున్నారు.
Read Also: Arvind Kejriwal: నేను ఈడీ విచారణకు రాలేను.. అధికారులు కాస్త ఓపికతో ఉండండి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో.. మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లకు.. పార్టీ పటిష్టతకు గ్రౌండ్ లెవల్‌లో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయనున్నారు. జిల్లాల్లో పార్టీ నేతల మధ్య విభేధాలను పరిష్కరించుకుని.. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా మార్గనిర్దేశనం చేయనున్నారు సీఎం జగన్.. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలే.. తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు నేతలు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిన మంచిని వివరిస్తూనే.. ప్రతిపక్షాలు చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేలా నేతలకు సీఎం వైఎస్ జగన్ సూచనలు చేస్తారని తెలుస్తోంది. కాగా, సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ.. ఇప్పటికే ‘సిద్ధం’ పేరుతో సభలు నిర్వహిస్తూ వస్తోంది వైసీపీ.. భారీ స్థాయిలో జనసమీకరణతో ఔరా! అనిపించేలా ఈ సభలు నిర్వహిస్తోన్న విషయం విదితమే.