State Investment Promotion Board: రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది.. తద్వారా కొత్తగా 69 వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ రోజు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది.. పలు పరిశ్రమల ప్రతిపాదనలకు, ప్రోత్సాహకాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.. ఈ సమావేశంలో మొత్తంగా రూ.19,037 కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర పడింది.. వాటి ద్వారా 69,565 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేయడంతో పాటు కీలక సూచనలు చేశారు సీఎం వైఎస్ జగన్..
ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగంలో అనూహ్య మార్పులు వస్తున్నాయి.. పరిశ్రమల ఉత్పాదకతలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి అన్నారు సీఎం జగన్.. వీటన్నింటినీ అధికారులు ఎప్పటికప్పుడు అవగాహణ చేసుకోవాలి.. ప్రపంచ పారిశ్రామిక రంగం పోకడలను అవగతం చేసుకోవాలి.. ఆ మేరకు పారిశ్రామిక విధానాల్లో మార్పులు, చేర్పులు చేయాలన్నారు. అత్యంత పారదర్శకత విధానాల ద్వారా అత్యంత సానుకూల వాతావరణాన్ని తీసుకురాగలిగాం.. ఈ క్రమంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచామన్నారు. ఈ ప్రయాణం మరింతగా ముందుకు సాగాలి.. పరిశ్రమల పట్ల సానుకూల క్రియాశీలతను మరింత బలోపేతం చేయాలి.. పరిశ్రమల ఏర్పాటుకోసం ఇచ్చే అనుమతులు, తదితర అంశాల్లో ప్రభుత్వం నుంచి వేగంగా స్పందిస్తున్నాం.. ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉన్నామన్న భరోసాను వారికి కల్పిస్తున్నాం.. అనుమతులు, క్లియరెన్స్ విషయంలో ఇప్పుడున్న వేగాన్ని మరింతంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు సీఎం జగన్.
ఇక, పారిశ్రామిక వర్గాలనుంచి వచ్చే ప్రతిపాదనల పట్ల చురుగ్గా వ్యవహరించడంతో పాటు, వాటికి త్వరగా అనుమతులు మంజూరుచేసే ప్రక్రియ వేగాన్ని ఇంకా పెంచాలని స్పష్టం చేశారు సీఎం జగన్.. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు విషయంలో మరింత వేగం పెంచాలన్న ఆయన.. గత ప్రభుత్వంలో కన్నా పరిశ్రమలకు పోత్సాహకాల విషయంలో ఈ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున మేలు చేకూర్చాం.. ఎంఎస్‌ఎంఈల రంగానికి పునరుజ్జీవం ఇచ్చాం.. ఇన్సెంటివ్‌లు ఇస్తూ వారికి చేదోడుగా నిలిచాం.. ఎంఎస్‌ఎంఈల పట్ల చాలా సానుకూలతతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఎక్కువ మంది వీటిపై ఆధారపడి బతుకుతున్నారు వీటిని కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత అన్నారు సీఎం వైఎస్ జగన్.
ఎస్‌ఐపీబీ ఆమోదం పొందిన కంపెనీల వివరాల్లోకి వెళ్తే..
* చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్న పెప్పర్ మోషన్ కంపెనీ. రూ.4,640 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 8,080 మందికి ఉద్యోగాలు.
* విజయనగరం జిల్లా ఎస్.కోటలో జేఎస్ డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం. రూ.531 కోట్లు పెట్టుబడి, 35,750 మందికి ప్రత్యక్షంగానూ, 9,375 మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు.
* శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు.. రూ.1750 కోట్ల పెట్టుబడి, 2000 మందికి ప్రత్యక్షంగానూ, మరో 500 మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు.
* అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో స్మైల్ కంపెనీ ఆధ్వర్యంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ తయారీ యూనిట్.. రూ.166 కోట్ల పెట్టుబడి, దాదాపు 5 వేలమందికి ఉద్యోగాలు.
* నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద కోస్టల్ ఆంధ్రా పవర్ లిమిటెడ్ (రిలయెన్స్ పవర్) తన పారిశ్రామిక కార్యకలాపాన్ని మార్చుకునేందుకు ఎస్‌ఐపీబీ ఆమోదం. థర్మల్ పవర్ స్ధానంలో కొత్త తరహా, సాంప్రదాయేతర పర్యావరణహిత గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంటుకు ఎస్‌ఐపీబీ ఆమోదం. రూ.6,174 కోట్ల పెట్టుబడి, 600 మందికి ప్రత్యక్షంగానూ, 2000 మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు.
* తూర్పుగోదావరి జిల్లా కడియం వద్ద ఆంధ్రాపేపర్ లిమిటెడ్ విస్తరణ. రూ.4వేల కోట్ల పెట్టుబడి, 3 వేలమందికి ఉద్యోగాలు.
* విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో ఏటీసీ టైర్స్ లిమిటెడ్ విస్తరణ. రూ.679 కోట్ల పెట్టుబడి, 300 మందికి ఉద్యోగాలు.
* తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో ఎలక్ట్రోస్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీ విస్తరణ. రూ.933 కోట్ల పెట్టుబడి, 2,100 మందికి ఉద్యోగాలు.
* ఏలూరు జిల్లా కొమ్మూరు వద్ద రూ.114 కోట్ల పెట్టుబడి పెట్టనున్న శ్రీ వెంకటేశ్వర బయోటెక్ లిమిటెడ్. 310 మందికి ఉద్యోగాలు. ఆమోదం తెలిపిన ఎస్‌ఐపీబీ.
* విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది వద్ద రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఓరిల్ పుడ్స్ లిమిటెడ్. దాదాపుగా 550 మందికి ఉద్యోగాలు..