CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి.. ఇప్పటి నుంచే అన్ని పార్టీలు వ్యూహాల్లో మునిగిపోయాయి.. ఇక, స్కిల్ స్కా్ం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆ తర్వాత టీడీపీ-జనసేన కలిసి ముందుకు వెళ్తాయని ప్రకటించారు.. దీంతో.. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తుపై అధికారిక ప్రకటన వచ్చినట్టు అయ్యింది.. అయితే, విజయవాడ వేదికగా జరిగిన వైసీపీ ప్రతినిధుల సమావేశంలో.. ఎన్నికల పొత్తులు, పవన్ కల్యాణ్‌పై పంచ్‌లు విసిరారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్.. రెండు సున్నాలు కలిసినా, నాలుగు సున్నాలు కలిసినా వచ్చేది సున్నానే అంటూ కౌంటర్ ఇచ్చారు. ఒకడు 15 ఏళ్లు అయ్యింది పార్టీ పెట్టి.. అయినా ఇప్పటికీ నియోజకవర్గంలో నాయకులు లేరు.. గ్రామాల్లో జెండా మోసే కార్యకర్త లేడు.. జీవితం అంతా చంద్రబాబును భుజాలపై మోయటానికే సరిపోతుంది అంటూ వ్యాఖ్యానించారు.
Read Also: CM YS Jagan: నాకు చంద్రబాబుపై ఎలాంటి కక్ష లేదు.. నేను లండన్‌లో ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు..
ఇక, చంద్రబాబు అవినీతిలో భాగస్వామి దత్తపుత్రుడు అంటూ పవన్ కల్యాణ్‌పై ఆరోపణలు గుప్పించారు సీఎం జగన్.. బిస్కెట్లు, చాక్లెట్లు పంచినట్లు దత్తపుత్రుడికి, తమ అనుచరులకు ప్రభుత్వ సొమ్ము పంచిపెట్టారని విమర్శించారు.. రాజకీయం అంటే దోచుకోవడం, పంచుకోవటం, తినుకోవటం కాదు.. చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో ఫోటో ఉండాలనుకోవడం నా రాజకీయం అని ప్రకటించారు.. పేదవాడి చిరునవ్వు లో మనం గుర్తుకు రావాలి అనుకోవడం నా రాజకీయం అంటూ కీలక వ్యాఖ్యాలు చేశారు.. వైసీపీ ప్రతినిధుల సభలో గంటన్నర పాటు సుదీర్ఘంగా ఉపన్యాసం చేశారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. కాగా, చంద్రబాబు అరెస్ట్ కు ముందు టీడీపీ-జనసేన కలిసి నడుస్తాయనే చర్చ సాగినా.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి ఆయనతో సమావేశమైన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై ప్రకటించిన విషయం విదితమే.. ఇప్పటి వరకు బీజేపీతో పొత్తులో ఉన్నాం.. బీజేపీ మాతో కలిసి వస్తుందని ఆశిస్తున్నామని కూడా పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.