మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రంగా తూర్పారబట్టారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడం చట్టాల ఓటమి కాదని, అది మోదీ ప్రభుత్వ చిత్తశుద్ధికి జరిగిన ఓటమి అని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో సీట్ల పెంపు (డిలిమిటేషన్), రిజర్వేషన్ల రద్దు వంటి ప్రయత్నాలను ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా అడ్డుకున్నాయని, ఇది బీజేపీ అహంకారానికి పట్టిన చెంపపెట్టు అని ఆయన పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లోనే ప్రజలు బీజేపీ కుట్రలను ఓడించారని, ఇప్పుడైనా పంతాలకు పోకుండా మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అడ్డంకి కాదని, తాము బిల్లుకు వ్యతిరేకం కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “ఒక గంటలో చట్టాన్ని సవరిస్తామని అమిత్ షా గతంలో చెప్పారు కదా.. ఇప్పుడు మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్ని తీసుకురండి, ఆ బిల్లు పాస్ అయ్యేలా కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుంటుంది” అని ఆయన సవాల్ విసిరారు. 2027లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లలోనే మహిళలకు కేటాయింపులు చేసేలా ఎటువంటి రాజ్యాంగ సవరణలు చేసినా తమ మద్దతు ఉంటుందని, కానీ జనాభా ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేలా సీట్ల పెంపును ముడిపెడితే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు.
Hit and Run Case : జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక మలుపు
దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు జనాభా నియంత్రణను పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలను అభినందించాల్సింది పోయి, సీట్ల సంఖ్య తగ్గించి శిక్ష వేయాలని చూడటం దుర్మార్గమన్నారు. సీట్ల పెంపు విధానంపై మోదీ ఎంచుకున్న పద్ధతికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల కోసం అవసరమైతే కొందరు మగవారి సీట్లను వదులుకోవాల్సి వస్తుందని, తన నియోజకవర్గం రిజర్వ్ అయినా తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఇదే క్రమంలో బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భజన రాజకీయాలు మాని రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని హితవు పలికారు. అలాగే, పార్లమెంట్ నిబంధనలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్న తేజస్వి సూర్య వంటి నేతలకు కనీస జ్ఞానం కల్పించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
