CM Revanth Reddy: SIRపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.. కాంగ్రెస్ నేతలకు సీఎం కీలక సూచనలు..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: ఎస్ఐఆర్ (SIR) అనేది అత్యంత సీరియస్ అంశమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కొందరు నాయకులు ఎస్ఐఆర్ (SIR) పై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని సీఎం మండిపడ్డారు. జిల్లాల వారీగా జరిగిన ఎస్ఐఆర్ అవగాహన సదస్సులపై పూర్తి రిపోర్ట్ తన వద్ద ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎస్ఐఆర్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించేలా మరిన్ని సదస్సులు నిర్వహించాలని, దీనిపై ఇంచార్జ్ మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ విషయంలో సరైన అవగాహన లేకపోతే క్షేత్రస్థాయిలో పేద ప్రజలకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల ఓట్లు పోతే వాళ్ల ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు కూడా పోయే ప్రమాదం ఉందని, పేదలకు ఎలాంటి నష్టం జరగనివ్వకూడదని తేల్చి చెప్పారు.

పార్టీ ఆదేశాలను ఎవరైనా సరే ఖచ్చితంగా పాటించాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ విషయంలో పార్టీ నిబంధనలను పట్టించుకోని వారిని గుర్తించి, వారి స్థానంలో తక్షణమే మరొక ఇంచార్జ్‌ను నియమిస్తామని హెచ్చరించారు. పని చేయకుండా పార్టీకి నష్టం కలిగిస్తామంటే చూస్తూ ఊరుకోనని, ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని అస్సలు క్షమించబోనని పేర్కొన్నారు. ఈ మేరకు నాయకులకు కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఇస్తున్నానని, ఈ లోపు మార్పు రాకపోతే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. పార్టీ సర్పంచ్‌లు, స్థానిక నాయకులను సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో ఎస్ఐఆర్ (SIR) పై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి, ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

×
×
Ad