కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు, అవినీతి ఆరోపణలపై మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దొర.. దోపిడి దొంగగా మారి ప్రజల సొమ్ము దోచుకున్నారని విమర్శించారు. ఆనాడు వేసిన శిక్షల మాదిరిగా రాళ్లతో కొట్టలేదని, నడి రోడ్డులో ఉరి వేయలేదని.. పద్ధతి ప్రకారం విచారణకు ఆదేశాలు ఇచ్చాం అని పేర్కొన్నారు. కేసీఆర్.. ఆయన మనువడు వరకు పరిపాలన చేయాలని ఆశ పడ్డారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలకు లక్ష కోట్ల అప్పు ఎలా వచ్చింది?, కేసీఆర్ కుటుంబానికి లక్ష కోట్ల అస్తులు ఎలా వచ్చాయి? అని ప్రశ్నించారు. కేసీఆర్ సహా మాజీ మంత్రి హరీష్ రావును శిక్షించాల్సిన అవసరం లేదా? అని సీఎం అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై ఆదివారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ‘ప్రాజెక్టు పేరుతో మాజీ సీఎం కేసీఆర్ చేసిన మోసం అంతా ఇంతా కాదు. ఏకంగా రూ.లక్ష కోట్లు జేబులో వేశారు. ఏఐబీపీ కింద ఏదైనా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే.. 75 శాతం నిధులు ఇచ్చే నిబంధన ఉంది. 2013లో 25 ప్రాజెక్టులను ఈ పథకం కింద కేంద్రం గుర్తించింది. ఆ జాబితాలో ప్రాణహిత-చేవెళ్ల ఉంది. ఆ ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చారు. డా బీఆర్ అంబేడ్కర్‌పై కోపంతో కేసీఆర్ ప్రాజెక్టు పేరును మార్చి మేడిగడ్డ పేరుతో లక్ష కోట్లు దోచుకున్నారు. కేసీఆర్, హరీశ్‌రావులు చేసిన అరాచకాలను ఈటల రాజేందర్ ఆపలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ సరిగా లేవు. ప్రాజెక్టు వైఫల్యం క్షమించరాని నేరమని ఎన్‌డీఎస్‌ఏ చెప్పింది. కమిషన్ ఇచ్చిన రిపోర్టులో లోపం ఉంటే చెప్పాలి. లోపాలుంటే ప్రస్తావించకుండా.. జస్టిస్ ఘోష్‌ను తక్కువ చేసి మాట్లాడటం సరికాదు’ అని అన్నారు.
‘పోచారం ప్రాజెక్ట్ నిటారుగా కనపడింది.103 ఏండ్ల ప్రాజెక్టు వర్షాలకు తెగిపోతుంది అనుకున్నాం కానీ బలంగా నిలబడింది. నిర్మాణం, నిర్వహణ, నాణ్యతలో శ్రద్ధ కనపడింది. కానీ కాళేశ్వరం మూడున్నరేలల్లో కట్టడం, కూలడం జరిగింది. కాళేశ్వరంపై విచారణ చేయొద్దు అని అడ్డుకుంటున్నారు. వ్యాప్కో సంస్థ.. తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలని చెప్పింది. మేడిగడ్డ దగ్గర బ్యారేజీ పెట్టాలని అనుకుంటున్న అని కేసీఆర్ చెప్పారు. దానికి అనుగుణంగా నివేదిక ఇవ్వండి అన్నారు, వ్యాప్కో కూడా సరే అని నివేదిక ఇచ్చింది. నువ్వు (కేసీఆర్) అడిగింది ఒకటి ఐతే.. సాంకేతిక నిపుణుడు వేరొకటి ఇవ్వరు కదా?. మేడిగడ్డ నిర్వహణ, నిర్మాణం లోపభూయిష్టం అని ఎన్‌డీఎస్‌ఏ నివేదికలో చెప్పింది. ఇది కాంగ్రెస్ చెప్పలేదు. డిజైన్, నిర్మాణం, మెయింటైన్ చేయడంలో కూడా లోపం ఉంది. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్.. ఎన్‌డీయే రిపోర్టని అంటున్నారు. అది ఆయన తెలివి తేటలు. నిజాం కంటే శ్రీమంతుడు కావాలని కేసీఆర్ కోరిక. కేసీఆర్ ఆయన మనువడు వరకు పరిపాలన చేయాలని ఆశ పడ్డారు’ అని సీఎం చెప్పారు.
Also Read: Kaleshwaram Project: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సీబీఐకి కాళేశ్వరం ప్రాజెక్టు కేసు!
‘మేడిగడ్డ లోపాలు 18.5.2020 రోజునే ఇంజనీర్ లేఖ రాశారు. ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని చెప్పారు. 2020లో మేము అధికారంలో లేము. మీరు అధికారంలో ఉండి లోపాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. కేసీఆర్.. హరీష్ సమాధానం చెప్పాలి. ప్రాజెక్టు కూలిపోయిందని అక్టోబర్ 21న మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్లో ఇంజనీర్ ఫిర్యాదు చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే లోపాలు బయటపడ్డాయి. ప్రాథమిక నివేదిక కూడా కేసీఆర్‌కి అందింది. ఇందులో భట్టి, శ్రీధర్ బాబు, నా పాత్ర ఏముంటుంది. మేడిగడ్డ చుట్టూ పోలీసులను పెట్టి.. పిట్టని కూడా రానివ్వలేదు. తుమ్మిడి హెట్టి నుండి ప్రాజెక్టు మేడిగడ్డకు మారడానికి కేసీఆర్ కారణం. నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానం చెప్పింది ఒకటి, చేసింది ఇంకొకటి. ఇప్పటి వరకు మేము రూ.19879 కోట్లు కట్టాం. ఇంకా రూ.60 వేల కోట్ల భారం ఉంద.. తెలంగాణ ప్రజలకు లక్ష కోట్ల అప్పు ఎలా వచ్చింది, కేసీఆర్ కుటుంబానికి లక్ష కోట్ల అస్తులు ఎలా వచ్చాయి. ప్రాణహిత ఉసూరు తీసి.. ఉరి వేసింది కేసీఆర్ కాదా?. ఆయనను.. హరీష్ రావును శిక్షించాల్సిన అవసరం లేదా?’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.