తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)కి కేసు అప్పగించాలని నిర్ణయించింది. ఆదివారం అసెంబ్లీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చకు సీఎం రేవంత్ రెడ్డి బదులిస్తూ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ భాగస్వామ్యమై ఉన్నాయని.. అందుకే కేసును సీబీఐకి అప్పగించడం సరైన నిర్ణయం అని సీఎం చెప్పారు. కాళేశ్వరం పేరుతో దోచుకున్నవాళ్లందరికి శిక్షపడాలిని ఆయన కోరారు.
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ‘తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు. కేంద్రమే నిధులిచ్చే ప్రాజెక్టులను కేసీఆర్ కాలదన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో లోపం ఉంటే చెప్పాలి. కానీ సుదీర్ఘ అనుభవం ఉన్న ఘోష్‌ని కించపరిచేలా మాట్లాడటం సరికాదు. పీసీ ఘోష్ అనేక ముఖ్యమైన హోదాల్లో పనిచేశారు. పీసీ ఘోష్ ఎన్నో కీలక తీర్పులు ఇచ్చారు. పీసీ ఘోష్‌ను తక్కువ చేసి మాట్లాడటం మంచిది కాదు. కాళేశ్వరం పనుల కోసం ఇప్పటి వరకు రూ.85,449 కోట్లు అప్పు తీసుకున్నారు. పీఎఫ్‌సీ నుంచి రూ.27,738 కోట్లు (11.5 శాతం వడ్డీ), ఆర్‌ఈసీ నుంచి రూ.30,536 కోట్లు (12 శాతం వడ్డీ) అప్పు తీసుకున్నారు. ఇప్పటి వరకు రూ.19,879 కోట్లు రుణం చెల్లించాం.. రూ.29,956 కోట్లు వడ్డీగా చెల్లించాం. మొత్తంగా రూ.49,835 కోట్లు చెల్లించినా.. ఇంకా రూ.60,869 కోట్ల అప్పు ఉంది. పనులు పూర్తి చేయడానికి ఇంకా రూ.47,000 కోట్లు కావాలి’ అని చెప్పారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అక్రమాలు, ప్రజా నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం మాజీ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసింది. పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను జూలై 31న ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికను ఆగస్టు 4న కేబినెట్ ఆమోదించింది. ఆదివారం అసెంబ్లీలో కమిషన్ నివేదికపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.