Bandi Sanjay : తెలంగాణలో ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిల అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రభుత్వమే విస్మరించిందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 8,000 కోట్ల ఫీజు బకాయిలు పేరుకుపోయాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. బండి సంజయ్ పేర్కొన్న వివరాల ప్రకారం, ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
Anand Deverakonda : 90’s దర్శకుడితో ‘బేబీ’ కాంబో.. క్లాప్ కొట్టిన నేషనల్ క్రష్
అధ్యాపకులకు జీతాలు, సిబ్బందికి భత్యాలు, కాలేజీల నిర్వహణ ఖర్చులు కూడా భరించలేని స్థితిలో ఉన్నాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు మూతపడటం ప్రారంభించాయని బండి సంజయ్ హెచ్చరించారు. విద్యార్థులకు ఫీజులు చెల్లించనిదే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో విద్యార్థులు, కళాశాల యాజమాన్యాల మధ్య వాగ్వాదాలు తీవ్రమై పోలీస్ స్టేషన్ల దాకా కేసులు వెళ్లుతున్నాయని అన్నారు.
అసెంబ్లీ సాక్షిగా ఫీజు బకాయిలను వన్ టైం సెటిల్ మెంట్ చేయాలని ఒకసారి, మరోసారి 12 వాయిదాల్లో చెల్లిస్తామని ముఖ్యమంత్రి మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ మాటలను విస్మరించడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. ఈ విద్యా సంవత్సరం నుండే బకాయిలను నిర్ణీత వ్యవధిలో చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. బండి సంజయ్ ప్రభుత్వానికి హితవు పలుకుతూ, విద్యార్థుల భవిష్యత్తును, కళాశాలల మనుగడను దృష్టిలో పెట్టుకుని తక్షణమే బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యారంగంపై ప్రభుత్వం చూపుతున్న అలసత్వం లక్షలాది మంది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మానసిక క్షోభ కలిగిస్తోందని తీవ్రంగా విమర్శించారు.