CM Revanth Reddy: తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడంలో నల్గొండ జిల్లా ముందువరుసలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి నల్గొండవాసేనని సీఎం తెలిపారు. నల్గొండలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు నూతన మెడికల్ కళాశాల భవనాన్ని ప్రారంభించారు. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన గడ్డ ఇదంటూ ఆయన కీర్తించారు. రజాకార్ల అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన జిల్లా నల్గొండ అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ పాలనలో నల్గొండ జిల్లాకు ఎక్కువ అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఫ్లోరైడ్ సమస్య పరిష్కారమయ్యేదని.. కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగా నల్గొండ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టేనని, ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం అన్నదని సీఎం చెప్పారు. 500 రూపాయల బోనస్ ఇచ్చి, వ్యవసాయం అంటే పండగ అనేలా ప్రభుత్వం చేస్తోందన్నారు. అధికారంలో ఉంటే పాలన, లేదంటే ఫాంహౌస్‌కు పరిమితం కావడం సరికాదని.. గెలిచినా, ఓడినా ప్రజలతోనే ఉండాలన్నారు. కేసీఆర్ ఎప్పుడైనా ప్రతిపక్ష నేత పాత్ర పోషించారా?.. శాసనసభలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉండటం తెలంగాణ సమాజానికి మంచిది కాదన్నారు.
Read Also: Minister Ponnam Prabhakar: ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రి పొన్నం సీరియస్
ఓడిపోతే ప్రజాక్షేత్రాన్ని వదిలిపెట్టడం మంచిది కాదని.. కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. కేసీఆర్ ఒక గాలి బ్యాచ్‌ను ఊరిమీదకు వదిలారని.. గెలిస్తే ఉప్పొంగడం, ఓడితే ఫామ్‌హౌస్‌కు పరిమితం కావడం మీ స్థాయికి తగదంటూ సూచించారు. ఏడాదైంది ఏనాడైనా ప్రతిపక్ష పాత్ర పోషించారా అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. పరీక్షలు పెట్టొద్దు, ఉద్యోగాలివ్వొద్దని అడ్డుపడటం మంచిదేనా అంటూ ప్రశ్నించారు. 1200 మంది ఆత్మబలిదానం చేసుకుంది మీ కుటుంబంలో నాలుగు ఉద్యోగాల కోసం కాదని ఎద్దేవా చేశారు.. నడ్డా మా అడ్డా మీదకు వచ్చారు.. అయ్యా మీరు అడ్డగోలుగా మాట్లాడకండంటూ సీఎం రేవంత్ అన్నారు.
మోడీకి సవాల్ విసిరిన సీఎం రేవంత్.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినన్ని ఉద్యోగాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇచ్చారో చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిలో 50 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చినట్లు నిరూపిస్తే.. నేను ఢిల్లీకి వచ్చి క్షమాపణ చెప్తానని సవాల్ విసిరారు. శాఖల వారీగా లెక్కలు కట్టి అసెంబ్లీలో చెప్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల గురించి మాట్లాడే అర్హత మీకు ఉన్నదా అని తాను అడుగుతున్నానన్నారు. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్అంటూ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై కొందరు చేస్తున్న విమర్శలు తిప్పికొట్టడంలో వెనుకబడ్డామన్నారు. ఒక కుటుంబం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామన్నారు. జనవరిలో రైతు భరోసా వేస్తామని సీఎం హామీ ఇచ్చారు. రైతులు నిర్భయంగా సన్నాలు సాగుచేయండి.. బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. రీజినల్ రింగ్ రోడ్డు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పూర్తి అవుతుందని ప్రకటించారు. ఫోర్త్ సిటీనీ కట్టే బాధ్యత నాది అంటూ సీఎం పేర్కొన్నారు. ఫోర్త్ సిటీ.. ఫీచర్ సిటీ అవుతుందన్నారు. మూసీ ప్రక్షాళన జరగాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవన బాధ్యత నాది అని.. మూసీ ప్రక్షాళన వద్దు అనే వాళ్ళకు ఘోరీ కట్టాలన్నారు.