CM Revanth Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఇవాళ ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా జేపీ నడ్డా, అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ కట్టర్, అమిత్ షా లతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ఈ భేటీల్లో ఆయన వివిధ అంశాలపై కేంద్ర మంత్రులతో విస్తృత చర్చలు జరపనున్నారు. ఇందులో ముఖ్యంగా..
Read Also:Wiaan Mulder: అందుకే బ్రియాన్ లారా రికార్డ్ ను వదిలేశా.. వియాన్ ముల్డర్ సంచలన వ్యాఖ్యలు..!
హైదరాబాద్ మెట్రో రైలు రెండవ దశ, మూసీ నది పునర్జీవన ప్రాజెక్ట్, ఎరువుల కొరత వంటి రాష్ట్రానికి ప్రాధాన్యమున్న అంశాలపై చర్చలు జరగనున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి సాంకేతిక, ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో సీఎం ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఢిల్లీ వెళ్లిన ఆయన, నిన్న కేంద్ర క్రీడా శాఖ మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడా వసతుల అభివృద్ధికి రూ. 100 కోట్లు మంజూరు చేయాలని ఆయన కోరారు. యువతలో క్రీడా శక్తిని అభివృద్ధి చేయాలని, క్రీడలతో పాటు క్రీడాకారులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు అంశంపై లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ తో కూడా సీఎం రేవంత్ ప్రత్యేకంగా చర్చించారు. యువతలో క్రీడా ఆసక్తిని పెంపొందించేందుకు ఇది కీలకం అవుతుందని అభిప్రాయపడ్డారు. కేవలం క్రీడలు మాత్రమే కాకుండా, చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూడా సీఎం రేవంత్ దృష్టి సారించారు. తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ఫిలిం సిటీ ఏర్పాటు గురించి బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ తో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. మొత్తంగా ఈ ఢిల్లీ పర్యటన ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రానికి అనేక రంగాల్లో సహకారం పొందే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టనున్నారు.