CM KCR : అసెంబ్లీ సమావేశాల చివరి రోజున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇటీవల రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను బాంబులతో పేల్చేయాలన్నారు. పేదోళ్లకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని ఆయన ప్రశ్నించారు. నక్సలైట్లు పేల్చేసినా అభ్యంతరం లేదని రేవంత్ వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహించారు. అలాగే బండి సంజయ్ సైతం కొత్త సచివాలయం గుమ్మటాలు కూల్చేస్తామని కామెంట్ చేశారు. తాము అధికారంలోకి వస్తే నిజాం వారసత్వ బానిస మరకలను సమూలంగా తుడిచివేస్తామని అన్నారు. ఇలా ఇద్దరు చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. కూల్చేస్తాం.. పేల్చేస్తామంటే చూస్తు ఊరుకోమన్నారు.. కాళ్లు చేతులు విరిచేస్తామన్నారు. అలా మాట్లాడిన వారిని ప్రజలే చూసుకుంటారని చెప్పారు.
Read Also: Errabelli Dayakar Rao : హైకోర్టు ఆదేశాల మేరకే గ్రామ పంచాయతీల ఏర్పాటు
చివరి రోజు అసెంబ్లీలో కేసీఆర్ ఇప్పటి ప్రతిపక్ష నేతలను.. ఒకప్పటి ప్రతిపక్ష నేతలను కలిపి విమర్శించారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా ఇంకుడు గుంతలు అని ఒకరు.. బొంకుడు గుంతల మాటలు ఒకరు చెప్పారని విమర్శించారు. వారున్న సమయంలో రాష్ట్రంలో చెరువులు, కాలువలు అన్ని ఎండిపోయాయన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కాల్వలన్నీ 9 నెలలు నిండుకుండలా ప్రవహిస్తున్నాయని అన్నారు. తెలంగాణ వాగులో నీళ్లు పారినట్లు, వచ్చే ఎన్నికల్లో తమకు ఓట్లు రాలుతాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాను చెప్పిన దాంట్లో ఒక్క అబద్ధమున్నా రాజీనామా చేస్తానని ప్రమాణం చేశారు. 2024 తర్వాత బీజేపీ కుప్పకూలడం ఖాయమని జోస్యం చెప్పారు.