మూడురోజుల పర్యటన కోసం సీఎం కేసీఆర్.. ఢిల్లీ చేరుకున్నారు. రేపు హస్తినలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేయనున్నారు కేసీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. రేపు మధ్యాహ్నం 1.48గంటలకు ఢిల్లీ వసంత్ విహార్‌లో.. టీఆర్‌ఎస్‌కు కేంద్రం కేటాయించిన స్థలంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న మంత్రులు.. నిర్మాణ స్థలంలో భూమిపూజ ఏర్పాట్లను పరిశీలించారు.
ఢిల్లీలోని వసంత్ విహారం మెట్రో స్టేషన్ పక్కన.. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం 1300 గజాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలంలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణంగా పార్లమెంట్ ఉభయసభల్లో.. కనీసం ఏడుగురు ఎంపీలు ఉన్న పార్టీలకు.. కార్యాలయం నిర్మాణం కోసం స్థలం కేటాయిస్తుంది కేంద్రప్రభుత్వం. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు 16 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ నిర్మాణం కోసం 1300 గజాల స్థలాన్ని కేటాయించింది కేంద్ర గృహనిర్మాణ శాఖ.