CM KCR Review: తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో జోరు వాన కురిసింది. ఏకధాటి వర్షానికి మరోసారి వాగులు, వంకలు ఉప్పొంగాయి. మూడు రోజులుగా శాంతించిన వరుణుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. తెలంగాణలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్‌కుమార్, నీటి పారుదలశాఖ అధికారులు, ఈఎన్సీలు, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టుల నీటిమట్టాలపై అధికారులతో కేసీఆర్ సమీక్ష చేశారు. అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించారు.
Heavy Rains: తెలంగాణలో వర్షబీభత్సం.. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
పలు జిల్లాల్లో ఇప్పటికే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో షియర్ జోన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండురోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే 18 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దవుతోంది.