రైతులకు సంబంధించి ఒకే రోజు 3 పథకాలను సీఎం జగన్ అమలు చేశారని వ్యవసాయ శాఖ మంత్రి, కన్నబాబు అన్నారు. ప్రతి రైతు సంతృప్తిగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎన్నికల్లో ఇచ్చిన మాటను వంద శాతం నెరవేర్చుతూ సీఎం జగన్ వాగ్దానాలను నిలబెట్టుకుంటున్నారన్నారు. ఇప్పటి వరకు రూ. 18,775 కోట్లు వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు ప్రభుత్వం నచ్చిందన్నారు. ఢిల్లీ వీధుల్లో చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.
స్వప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని, ప్రజలను చంద్రబాబు కించపరుస్తున్నారు. ప్రధాని సహా ముఖ్య నేతల అపాయింట్‌మెంట్ల కోసం పాట్లు పడుతూ ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారని ఎద్దేవా చేశారు మంత్రి కన్నబాబు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు చిక్కుకున్నారని, ఇంకో పదేళ్లు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఇవ్వాలని డిమాండ్ చేయాలని కోరాల్సింది పోయి పారిపోయి వచ్చారన్నారు.
చంద్రబాబు వల్ల హైదరాబాద్ పై హక్కులు వదులుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని మంత్రి కన్నబాబు అన్నారు . ఢిల్లీ వీధుల్లో చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారు. ఇవి భాజపా వారికి తెలుసు.. కొత్త కాదు. చంద్రబాబు దుర్మార్గమైన రాజకీయాలు మోడీ, అమిత్ షాకు తెలుసు. తెలుగుదేశం పార్టీపై మేం కూడా ఈసీని కలిసి ఫిర్యాదు చేస్తాం. బీజేపీకి భాగస్వామిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. విశాఖ ఉక్కు సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారో చూద్దాం. రాష్ట్రంలో 356 ఆర్టికల్ పెట్టాలని కోరే 420లు ఎవరో ప్రజలకు బాగా తెలుసునని మంత్రి కన్నబాబు అన్నారు.