నేడు కాకినాడ జిల్లాలోకి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రవేశించనుంది. సాయంత్రం అచ్చంపేట జంక్షన్‌లో బహిరంగ సభ నిర్వహించనుండగా.. ఆ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం వైఎస్ జగన్ గురువారం రాత్రి బస చేసిన ఎస్‌టీ రాజపురం ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్దకు చేరుకొని బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.
17వ రోజు సీఎం జగన్ బస్సు యాత్రకు జనవాహిని పోటెత్తింది. జాతీయ రహదారి బాట పట్టిన గ్రామాలు.. జనసంద్రమైన రావులపాలెం.. రాజమహేంద్రి.. రోడ్డుకు ఇరువైపులా మానవహారాలు, కడియపులంకలో సీఎం వైఎస్ జగన్‌పై పూల వర్షం కురిపించారు. వేమగిరిలో ఎడ్లబండ్లపై తరలి వచ్చిన రైతన్నలు, బైక్ ర్యాలీలతో కదం తొక్కిన యువత.. విద్యార్థుల్లో వెల్లివిరిసిన ఉత్సాహం, బొమ్మూరులో 108 గుమ్మడి కాయలతో దిష్టి తీశారు మహిళలు. అందరి నుంచి విజ్ఞాపనలు స్వీకరించి అభయమిచ్చిన జననేత, వైద్య విద్యను చేరువ చేసిన సంస్కరణలశీలికి భావి డాక్టర్ల ధన్యవాదాలు చేశారు. అడుగడుగునా అభిమానుల తాకిడితో యాత్ర ఆలస్యం అయింది. నుదుట గాయం బాధిస్తున్నా చెరగని చిరునవ్వుతో సీఎం జగన్ అభివాదం చేస్తూ మందుకు కదిలారు.