CM Chandrababu: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలో పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టేందుకు వెనుకాడబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షించారు సీఎం.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ ను 2027 పుష్కరాలకు ముందుగానే పనులు పూర్తిచేసి జాతికి అంకితం ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు. ఇందుకుగాను కాంట్రాక్టర్లు వారికి కేటాయించిన పనులను నిర్దేశించిన సమయానికంటే ముందుగానే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్చి నెలాఖరుకు కాంట్రాక్టర్లకు నిర్దేశించిన పనులలో కొంతమంది కాంట్రాక్టర్లు వెనుకబడి ఉండడం, కొందరు సమావేశానికి హాజరు కాకపోవడంపై ముఖ్యమంతి స్పందిస్తూ.. పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ అని దీని దృష్ట్యా పనులు పూర్తి చేయడంలో కాంట్రాక్టర్లు అలసత్వం వహించవద్దని స్పష్టం చేశారు.
Read Also: Minister Ramprasad Reddy: వైసీపీకి మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సవాల్.. రాజీనామాలు చేసి రండి..!
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేసేందుకు దశలవారీగా లక్ష్యాలను నిర్దేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. డయాఫ్రమ్ నిర్మాణాన్ని 2025 డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని, రైట్ మెయిన్ కెనాల్ కనెక్టవిటీలను జులై, 2026 నాటికి పూర్తిచేయాలన్నారు. ఈసీఆర్ఎఫ్-గ్యాప్ 1 పనులను 2026 మార్చి లోగా పూర్తి చేయాలన్నారు. ఈసీఆర్ఎఫ్-గ్యాప్ 2 పనులను 2027 డిసెంబర్ నాటికి లక్ష్యం నిర్దేశించినప్పటికీ గోదావరి పుష్కరాల కంటే ముందుగానే 2027, ఏప్రిల్ నాటికి పూర్తిచేసి, జాతికి అంకితం చేసేలా అధికారులు, కాంట్రాక్టర్లు పనిచేయాలన్నారు. అర్హులైన ప్రతీ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాపికొండల నుండి ధవళేశ్వరం వరకు పర్యాటకంగా హోటల్స్ ఏర్పాటుచేయడం, పోలవరం ప్రాజెక్ట్ వద్ద ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు, పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం. బట్రెస్ డ్యాం పూర్తికి 82 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ప్రాజెక్ట్ అత్యవసర పనులు నిమిత్తం 400 కోట్ల రూపాయలు, భూసేకరణ, పునరావాస కార్యక్రమాలకు అత్యవసరంగా 486 కోట్ల రూపాయలు మొత్తం 886 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఇంజనీరింగ్ అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు.