ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం కుటుంబంతో కలిసి నేడు, రేపు తిరుమల పర్యటనకు వెళుతున్నారు. సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌తో కలిసి చంద్రబాబు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం దర్శించుకోనున్నారు. చంద్రబాబు కుటుంబం ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
గురువారం రాత్రి 10:30 గంటలకు సీఎం చంద్రబాబు తిరుమల చేరుకోనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు కుటుంబసభ్యులతో కలసి సీఎం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దగ్గరుండి చూసుకుంటారు. దర్శనానంతరం కుటుంబసభ్యులతో కలసి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంకు చేరుకుంటారు. అక్కడ భక్తులకు అన్నప్రసాదంని సీఎం స్వయంగా వడ్డించనున్నారు. నారా దేవాన్ష్ పుట్టినరోజు నాడు (మార్చి 21) అన్నప్రసాద కేంద్రంలో అయ్యే ఖర్చు రూ.44 లక్షలను సీఎం భరించనున్నారు. రూ. 44 లక్షలను టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు విరాళంగా అందించనున్నారు.
శుక్రవారం ఉదయం 10 గంటలకు అన్నమయ్య భవన్‌లో టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం తరువాత సీఎం తిరుమల పర్యటన ముగించుకుని.. రేణిగుంట విమానాశ్రయానికి భయలుదేరి వెళతారు. రెండు రోజులుగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో చంద్రబాబు, బిల్ గేట్స్ సమక్షంలో ఇరువర్గాలు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.