CM Chandrababu: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు. సీఎస్, సీఎంఓ, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీసు అధికారులతో సమీక్ష చేపట్టారు. అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు ప్రాథమిక సమాచారం. అసైన్డ్, 22-ఎ, కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీ సర్వే ఫైల్స్ దగ్దం అయినట్లు సీఎంకు అధికారులు వివరించారు. జిల్లా కలెక్టర్‌తో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. రాత్రి 11.24 ప్రమాదం జరిగినట్లు జిల్లా అధికారులు వివరించారు. ఘటనపై జిల్లా అధికారుల సత్వర స్పందన లేకపోవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి 10.30 గంటలకు వరకు కార్యాలయంలోనే గౌతమ్ అనే ఉద్యోగి ఉన్నారని గుర్తించారు. గౌతమ్ తేజను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ సమయం వరకు ఉండడానికి కారణాలను తెలుసుకోవాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు.
Read Also: Fire Accident In AP: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్నిప్రమాదం.. ప్రభుత్వం అత్యవసర విచారణ
గౌతమ్ ఎందుకు వెళ్లాడు, ఏ పని కోసం వెళ్లాడని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఘటన సమయంలో విధుల్లో వీఆర్ఏ ఉన్నాడని అధికారులు వివరించారు. ఘటనా ప్రాంతానికి పోలీసు జాగిలాలు వెళ్లాయా, ఉదయం నుంచి ఏం విచారణ చేశారని సీఎం ప్రశ్నలు గుప్పించారు. ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, ఇతర ఆధారాల సేకరణ విషయంలో జాప్యంపై ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఘటన సమయంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపైనా విచారణ జరపాలన్నారు. సీసీ కెమేరాల ఫుటేజ్ వెంటనే హ్యాండోవర్ చేసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ ప్రాంతంలో ఆ సమయంలో సంచరించిన వ్యక్తుల వివరాలు, వారి కాల్ డాటా సేకరించాలని ఆదేశించారు. నేరాలు చేసి సాక్ష్యాలు చెరిపివేయడంలో ఆరితేరిన వ్యక్తులు మొన్నటి వరకు అధికారంలో ఉన్నారని సీఎం విమర్శించారు. గతంలో సాక్ష్యాలు మాయం చేసిన ఘటనలు అధికారులు మరిచిపోకూడదన్నారు. ఘటనపై మినిట్ టు మినిట్ ఏం జరిగిందనే వివరాలు సమగ్రంగా తన ముందు ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.