CM Chandrababu: అమరావతి విషయంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు నాయుడు.. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం సూరేపల్లిలో నిర్వహించిన “మీ భూమి–మీ హక్కు” గ్రామసభకు హాజరైన ఆయన.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తూ, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఇప్పటివరకు ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు తెలియజేయడానికే వచ్చానని సీఎం తెలిపారు. రైతులకు పాస్ పుస్తకాలు అందజేసినప్పుడు వారి ఆనందాన్ని చూసి సంతోషించానన్నారు. గత ఐదేళ్లలో ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని, ఇప్పుడు సంక్షేమంతో పాటు సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. ప్రజల ఆనందమే ప్రభుత్వానికి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.
భూమి అనేది కేవలం ఆస్తి మాత్రమే కాదు, జీవనాధారం మరియు భద్రత అని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వం భూములపై అక్రమాలు చేసి, ఆస్తులను కబ్జా చేసి, పత్రాలపై తమ ఫొటోలు వేసిందని విమర్శించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, కోటి 12 లక్షల పాస్ పుస్తకాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కరెన్సీకి ఉపయోగించే సాంకేతికతను పాస్ పుస్తకాలలో ఉపయోగించి ఎలాంటి తారుమారులకు అవకాశం లేకుండా చేస్తున్నామని చెప్పారు. ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాస్ పుస్తకాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో వ్యవస్థలు దెబ్బతిన్నాయని, వాటిని సరిదిద్దడానికి సమయం పట్టిందని సీఎం పేర్కొన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తమదేనని తెలిపారు. అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు చేస్తూ, “నాయకుడే సైకో అనుకున్నాం… పార్టీ కూడా సైకో పార్టీ” అని వ్యాఖ్యానించారు. ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ “మొన్న మూడుముక్కలాట, నిన్న మావిగన్ అన్నారు.. ఇంకా నయం వాటికన్ అనలేదు” అని ఎద్దేవా చేశారు. వాటికన్ వంటి పవిత్ర స్థలాల పేరును కూడా తప్పుగా ఉపయోగించలేదని అన్నారు.
అమరావతి రాజధానిపై మాట్లాడిన సీఎం చంద్రబాబు.. “అమరావతి జోలికొస్తే ఊరుకునేది లేదు. వెయ్యి మంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. అమరావతి అభివృద్ధి కోసం ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్ చేపట్టినట్లు తెలిపారు. అమరావతి పేరే చెప్పడానికి ఇష్టపడని వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తూ, “ఎక్కడో ఉంటారు.. వచ్చి మాట్లాడి మళ్లీ వెళ్లిపోతారు” అని అన్నారు. తీవ్రవాదుల్లా అకస్మాత్తుగా వచ్చి భయాందోళనలు సృష్టించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం భూ హక్కులను కాపాడటానికి, పారదర్శక పాలన అందించటానికి కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.