CM Chandrababu: టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నేడు కీలక రాజకీయ వేడుకలకు వేదికైంది. మండల పార్టీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలు సీఎం వద్ద వినతులు ఇవ్వడంతో కార్యాలయం సందడిగా మారింది. సీఎం చంద్రబాబు మంత్రులు, జిల్లాల త్రిసభ్య కమిటీ సభ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. ఇటీవల జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల నియామకంపై కమిటీ కాలయాపన పట్ల వ్యక్తం చేసిన అసంతృప్తిని గుర్తుచేస్తూ, త్వరలోనే నియామకాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులతో కూడా సీఎం భేటీ అవుతారని తెలిసింది.
“కాఫీ కబుర్లు” పేరుతో మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలో చంద్రబాబు స్వయంగా చర్చల్లో పాల్గొన్నారు. శిక్షణ కార్యక్రమాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ సమయంలో చెట్ల నీడలో, ఎర్రటి ఎండలో శిక్షణ నిర్వహించాల్సిన రోజులను గుర్తు చేసుకుంటూ.. ఇప్పటి తరానికి లభిస్తున్న అనుకూల వాతావరణం, ఆధునిక సౌకర్యాలను గుర్తు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు గుర్తుచేశారు.
అలాగే పార్టీ భావజాలం, సిద్ధాంతాలు ప్రతి కార్యకర్తకు అవగాహన కావాలని చంద్రబాబు సూచించారు. నాయకులు, కార్యకర్తలకు చేరువై, వారిని ప్రేరేపించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇంకా అన్నదాత సుఖీభవ, దీపం 2.0, స్త్రీశక్తి, తల్లికి వందనం వంటి కీలక పథకాలను ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. మహిళల ఓటు బ్యాంక్ టీడీపీకి మెజారిటీగా రావాలంటే కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. బూత్ స్థాయిలో సమన్వయం, క్రమశిక్షణ, బలాబలాల విశ్లేషణ ముఖ్యమని, ప్రతి బూత్ బలోపేతం కావాలని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడ సమర్థవంతమైన నాయకత్వం ఉంటే అక్కడ పార్టీకి అధిక ఓట్లు వస్తాయని గుర్తుచేశారు.
Satya Kumar Yadav: వాజపేయి అడుగుజాడల్లో రాష్ట్రంలో సుపరిపాలన యాత్ర..
గత ఐదు సంవత్సరాల్లో విధ్వంసమైన ప్రభుత్వ వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టామని చెప్పారు. ప్రతిపక్షంలో ఎంత బాగా పని చేశారో.. ఇప్పుడు అధికారంలో మరింత అప్రమత్తంగా, శక్తివంతంగా పనిచేయాలని సూచించారు. ఇక రాష్ట్రంలో పింఛన్లకే ఏటా రూ.33 వేల కోట్లను ఖర్చు చేస్తున్నారని తెలిపారు. కొందరు డబ్బుతోనే ఎన్నికలు గెలవగలమని భావిస్తారని, కానీ ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళితేనే నిజమైన విజయం సాధ్యమవుతుందని సీఎం అన్నారు. పని చేయడం ఒక ఎత్తు, చేసిన పనిని ప్రజలకు చేరవేయడం మరో ఎత్తు అని చంద్రబాబు స్పష్టం చేశారు.