CM Chandrababu: కాకినాడ జిల్లా తుని పర్యటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తుని నియోజకవర్గ ప్రజలు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన యనమల దివ్యకు మంచి మన్ననలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఒకప్పుడు తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేదని, అయితే యనమల రామకృష్ణుడు ప్రత్యక్ష ఎన్నికలకు దూరమైన తర్వాత నియోజకవర్గం కొంత వెనుకబడిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే ఉద్దేశంతో పొత్తుల అవసరాన్ని ముందుగానే గుర్తించి ప్రకటించిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని చంద్రబాబు అన్నారు. రెండేళ్ల క్రితం ఇదే నెల 12వ తేదీన తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. పవన్ ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నారని తెలిపారు.
సంక్షేమ పథకాలపై మాట్లాడుతూ, కేవలం బటన్ నొక్కడం ద్వారా నిధులు పంపిణీ చేయడంలో ఒక రకమైన ఆనందం ఉంటుందని అన్నారు చంద్రబాబు. మహిళలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించేందుకు 33 శాతం సీట్లను కేటాయించి వారిని నాయకత్వ స్థానాలకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్య రంగంలో సంస్కరణలపై స్పందిస్తూ, ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా “సంజీవని” ప్రాజెక్టును అమలు చేస్తామని తెలిపారు. అలాగే ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత డాక్టర్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నానికి రైల్వే జోన్ సాధించామని చెప్పారు. సమాజంలో పెరుగుతున్న మానసిక ఒత్తిళ్లపై స్పందించిన సీఎం, చాలామంది టెలివిజన్ సీరియల్స్ చూసి అనవసర టెన్షన్లు తెచ్చుకుంటున్నారని అన్నారు. సెల్ఫోన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని 2047 నాటికి దేశానికి ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు, విధ్వంసక రాజకీయాలు చేసే వారిని “గొడ్డలి పార్టీ”గా అభివర్ణించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తావిస్తూ పలు ఆరోపణలు చేశారు. అలాగే గతంలో కోడికత్తి, గులకరాయి వంటి ఘటనలతో రాజకీయ డ్రామాలు సృష్టించారని విమర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎవరూ ఆపలేరని ఘాటుగా హెచ్చరించారు.. నేను పవన్ రాష్ట్రాన్ని పైకి తీసుకుపోవడం.. గొడ్డలి పార్టీ కింద పడేయడం.. వైకుంఠపాలి వద్దు అని సూచించారు..
డీఎస్సీ నియామకాల అంశంపై మాట్లాడుతూ, గత ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు చంద్రబాబు.. తమ ప్రభుత్వం డీఎస్సీని పారదర్శకంగా నిర్వహిస్తోందని, ఇందుకోసం 40 వేల ప్రశ్నలు, 25 ప్రశ్నాపత్రాలు సిద్ధం చేశామని తెలిపారు. అయినప్పటికీ డీఎస్సీపై అనవసర అనుమానాలు సృష్టించి రాష్ట్రంలో అభద్రతా భావాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. తిరుమల, ఇతర ప్రాంతాల్లో కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించిన సీఎం, కొన్ని ఘటనలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. నంద్యాలలో వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో కూడా ప్రతిపక్ష కార్యకర్తలే పాత్రధారులని పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై మాట్లాడుతూ, విశాఖపట్నం, అమరావతి, తిరుపతిని మూడు ప్రధాన రీజియన్లుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు సీఎం.. రైతులు తమ పంటలను ఎగుమతి చేసుకునే అవకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని, ఆక్వా రంగానికి ఉన్న లాజిస్టిక్ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మహిళలకు త్వరలో ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం తెలిపారు. తుని ప్రజల సంతృప్తి సూచీలో ప్రస్తుతం రాష్ట్రంలో 91వ స్థానంలో ఉందని, గతంలో ఇది 61వ స్థానంలో ఉండేదని చెప్పారు. తుని అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు.
రెవెన్యూ శాఖలో త్వరలో సమగ్ర ప్రక్షాళన చేపడతామని, ప్రజల రెవెన్యూ సమస్యలను వచ్చే మార్చి నాటికి పరిష్కరించే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. త్వరలో గ్రామాలకు ఆకస్మికంగా పర్యటించి, అధికారులతో కలిసి బస్సులో ప్రజల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలను నేరుగా తెలుసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
