గాలి, బొగ్గు, నీరు, సోలార్‌తో విద్యుత్ ఉత్పత్తి కావడం తాను చూశానని.. ఎద్దులను ఉపయోగించి కరెంట్ ప్రొడ్యూస్ చేయడం తొలిసారి చూస్తున్నా అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో నందగోకులం లైఫ్ స్కూల్‌ను ప్రారంభించిన అనంతరం.. విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్‌కు సీఎం శ్రీకారం చుట్టారు. నందగోకులం ప్రాంగణంలో మూడు ప్రాజెక్టులు ప్రారంభించానని చెప్పారు. ఆహారం, నిద్ర, వ్యాయామం, మంచి పనులు చేస్తూ.. అందరూ ఆరోగ్యంగా ఉండండని సీఎం సూచించారు. సమాజం వల్ల పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ సమాజానికి తిరిగి ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.
‘నందగోకులం ప్రాంగణంలో మూడు ప్రాజెక్టులు ప్రారంభించాను. ఇథనాయిల్ ప్రాజెక్టు, లైఫ్ స్కూల్, గోశాల ప్రారంభం జరగడం సంతోషంగా ఉంది. ఇథనాయిల్ పరిశ్రమ వల్ల రైతులకు మంచి జరుగుతుంది. నూకల ద్వారా పెట్రోల్‌లో కలిపేందుకు ఇథనాయిల్ తయారు చేస్తారు. ఆవులు, ఎద్దులను కాపాడుకునేలా గోశాల ఏర్పాటు చేశారు. ఎద్దులతో కరెంట్ ఉత్పత్తి చేసేలా కొత్త ప్రక్రియ తీసుకువచ్చారు. ఎద్దులను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయడం తొలిసారి చూస్తున్నా. రాష్ట్రంలో ఒంగోలు జాతి ఎద్దులు కనుమరుగయ్యాయి. బ్రెజిల్‌లో ఒంగోలు జాతి బ్రీడ్‌ను కాపాడుకుంటూ వస్తున్నారు. వారు ఒంగోలు జాతిని ప్రపంచానికి అందించే పరిస్థితికొచ్చారు. ఆహారం, నిద్ర, వ్యాయామం, మంచి పనులు చేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండండి. పేద పిల్లలకి నందగోకులం స్కూల్‌లో మంచి విద్య అందించడం ఆనందంగా ఉంది. ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రతిఒక్కరు పి4లో భాగస్వాములు అవ్వాలి. సమాజం నుంచి ఎదిగిన వారు తిరిగి సమాజానికి ఏదొకటి చేయాలి’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
Also Read: AP Fake Liquor: ఏపీ కల్తీ మద్యం కేసులో కీలక పరిణామం.. ఏ1 జనార్దన్ రావు అరెస్ట్!
‘నెల్లూరు జిల్లా అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం. సోమశిల, కండలేరు ప్రాజెక్టుల ద్వారా 150 టీఎంసీల నీరు ఉంటుంది. కృష్ణపట్నం పోర్టు ఉంది. త్వరలో రామాయపట్నం, దుగ్గరాజుపట్నం రాబోతోంది. జిల్లాలో ఎయిర్పోర్ట్ వస్తుంది. జాతీయ రహదారులు, రైల్వే కనెక్టివిటీ ఉంది. బీపీసీఎల్ కంపెనీ, క్రిప్ కో గ్రీన్ ఎనర్జీ వంటి కంపెనీలు రానున్నాయి. 2047 కల్లా భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉంటుంది. అప్పటికి ఆంద్రప్రదేశ్ ని దేశంలో నంబర్ 1గా మారుస్తాం. గూగుల్ డేటా సెంటర్, ఎఐ విశాఖపట్నంకి రాబోతోంది. హైదరాబాదులో ఐటి ప్రమోట్ చేసాం.. ఏపీ అభివృద్ధి భారీగా జరగబోతోంది’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.