అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఏ1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావును గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి విజయవాడ వచ్చిన జనార్దన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 24న సౌత్ ఆఫ్రికా వెళ్లిన జనార్ధన్ రావు ఇవాళ గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు. విజయవాడకు చెందిన జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Also Read: Varudu Kalyani: నారావారి పాలన కల్తీ సారా పాలనగా మారింది.. వరదు కళ్యాణి విమర్శలు!
ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం కేసులో జనార్ధన్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. జనార్దన్‍రావు, అతని అనుచరుడు రాజు కలిసి ములకల చెరువు కనుగొండ ఆర్చి ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు సంచరం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో రూ.1.75 కోట్ల విలువైన నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ములకల చెరువులో తయారు చేసిన నకిలీ మద్యాన్ని విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన బాట్లింగ్ యూనిట్‌లో ప్రాసెసింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇబ్రహీంపట్నం ఏఎన్‌ఆర్ బార్ వద్ద నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని కూడా ప్రారంభించి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. జగన్మోహన్ రావు సాయంతో జనార్దన్ రావు ఈ దందా నడిపించినట్టు విచారణలో తేలింది.