నేడు దేశ రాజధాని ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. సాయంత్రం 4.30కు విజయవాడ నుంచి ఢిల్లీ పర్యటనకు బయల్దేరనున్నారు. సాయంత్రం 6.30కి సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీ చేరుకోనున్నారు. రాత్రి 7 గంటలకు ఢిల్లీలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కుమారుడి రిసెప్షన్‌కు హాజరవుతారు. ఈరోజు రాత్రికి ఇద్దరు ఢిల్లీలోనే బస చేస్తారు.
బుధవారం ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. అమరావతి పునఃప్రారంభానికి ప్రధానిని సీఎం ఆహ్వానించనున్నారు. రాజధాని నిధులతో పాటు పలు అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించనున్నారు. బుధవారం రాత్రి తిరిగి సీఎం, డిప్యూటీ సీఎం అమరావతి చేరుకోనున్నారు.
ఇక ఏపీ శాసనసభ 13వ రోజు సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో కాలువల ఆక్రమణలు, ప్రైవేట్ పాఠశాలలో భద్రత చర్యలు, బుడమేరు ఆక్రమణ, సూపర్ సిక్స్ పథకాలు.. తదితర అంశాలపై శాసనసభలో ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. ఉదయం 10.30 గంటలకు సీఎం చంద్రబాబు అసెంబ్లీకి రానున్నారు. ఉదయం 10.30 నుంచి 02.30 వరకు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 వరకు సీఆర్డీఏపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30 నుంచి 4 వరకు మైనింగ్ విభాగంపై సమీక్ష నిర్వహించనున్నారు. ఆపై ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.