‘మొంథా’ తుఫాన్ ప్రభావం, తాజా పరిస్థితులపై సీఎం చంద్రబాబు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ నేపథ్యంలో ఆదివారం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకూడదని హెచ్చరించారు. ముందస్తు జాగ్రత్త చర్యలతో తక్షణం సన్నద్ధమవ్వండని సూచించారు. అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలని సీఎం అధికారులకు చెప్పారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆ తర్వాత తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడబోతోంది. ఈ తుఫానుకు మొంథా అని నామకరణం చేశారు.
Also Read: Virat Kohli: అందరికీ ధన్యవాదాలు.. విరాట్ కోహ్లీ భావోద్వేగ ఇంటర్వ్యూ!
‘ఈనెల 26, 27, 28, 29 తేదీల్లో తుఫాను తీవ్ర ప్రభావం చూపనుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకూ దీని ప్రభావం ఉంటుంది. కాకినాడ సమీపంలో మొంథా తీవ్ర తుపానుగా మారి తీరం దాటుతుంది. ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అవసరమైతే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను ముందుగానే సిద్ధం చేయాలి. కాకినాడలో హాస్పిటల్ ఆన్ వీల్స్ సేవలను ప్రారంభించాలి. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ఇన్‌ఛార్జి అధికారులను నియమించాలి’ అని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. వాతావరణ శాఖ అలెర్ట్‌తో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.