Tragedy: కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో అఫ్జల్‌పూర్ తాలూకాలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రమాదవశాత్తూ వేడివేడిగా ఉన్న సాంబార్ పాత్రలో పడిన మూడు రోజుల తర్వాత రెండో తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఆ విద్యార్థిని బెంగళూరు ఆసుపత్రిలో కాలిన గాయాలతో మృతి చెందిందని పోలీసులు సోమవారం తెలిపారు. నవంబర్ 16న పాఠశాలకు అనుబంధంగా ఉన్న మధ్యాహ్న భోజన వంటశాల వద్ద జరిగిన ఈ విషాద ఘటనలో ఏడేళ్ల మహంతమ్మ శివప్ప తలావార్ తీవ్రంగా గాయపడినట్లు వారు తెలిపారు.
Also Read: Supreme Court: మరో రాష్ట్రంలో ఎఫ్‌ఐఆర్ చేసినా.. ముందస్తు బెయిల్ మంజూరు చేయవచ్చు..
ఈ ఘటనతో పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బంది, ప్రధాన వంట మనిషిని సస్పెండ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చిన్నారికి 40 శాతం కాలిన గాయాలయ్యాయని, వెంటనే చౌడాపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అందించి తదుపరి చికిత్స కోసం జిల్లాలోని మరో ఆస్పత్రికి తరలించామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఆమె పరిస్థితి విషమించడంతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిందని ఆయన చెప్పారు. బాధితురాలి తల్లి నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 304 A కింద నిర్లక్ష్యం కారణంగా మరణం కేసు నమోదు చేయబడింది. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ఆయన తెలిపారు.