TDP vs YCP: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా, తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరులో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. ఎన్నికల కోడ్ ముగియడంతో టీడీపీ వర్గీయులు బాణాసంచా కాల్చుతుండగా.. కర్రలు, రాళ్లతో వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వర్గీయులు దాడి చేసినట్టు టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు.. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో తండ్రి కొడుకులు విజయులురెడ్డి, రాకేష్‌రెడ్డిలపై వైసీపీ నాయకులు కర్రలతో రాళ్లతో దాడి చేసి గాయపరిచిన సంఘటన చోటుచేసుకుంది. చిల్లకూరు గ్రామానికి చెందిన విజయులురెడ్డి, రాకేష్‌రెడ్డిలు ఎన్నికలలో టీడీపీకి ఓట్లు వేయించారన్న కోపంతో అదే గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నేత కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి తన వర్గీయులతో కలిసి అర్ధరాత్రి సమయంలో గ్రామంలో విజయులురెడ్డిని కర్రలతో రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు.
Read Also: Mallu Bhatti Vikramarka: నేడు వివిధ శాఖలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ…
ఇక, అడ్డుకోబోయిన ఆయన కుమారుడు రాకేష్‌రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, అర్భన్ సీఐ జగన్‌మోహన్‌రావు, ఎస్‌ఐ శ్రీకాంత్‌లు సంఘటన స్థలానికి చేరుకుని దాడిలో తీవ్రంగా గాయపడిన విజయులురెడ్డి, రాకేష్‌లను చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.