Skill Development Case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి రిమాండ్‌ను కోర్టు పొడిగించింది.. ఇదే సమయంలో.. రెండు రోజుల సీఐడీ కస్టడీకి కూడా అనుమతి ఇచ్చింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. రెండ్రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు చంద్రబాబును విచారించనున్నారు. ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించనున్నారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన కస్టడీ మేరకు సీఐడీ విచారణ జరగనుంది. సీఐడీ కస్టడీ నేపథ్యంలో ఏసీబీ కోర్టు నిబంధనలు జారీ చేసింది. విచారణ అధికారుల పేర్లు ఇవ్వాలని, న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణకు అనుమతించారు. ప్రతి గంటకు మధ్య ఐదు నిమిషాల విరామం ఇవ్వాలన్నారు. భోజన విరామం గంటసేపు ఉండాలని ఆదేశించారు. విచారణ జరుపుతున్న వీడియో, ఫొటోలు విడుదల చేయరాదని షరతులు విధించారు. విచారణ సందర్భంలో చంద్రబాబు తరఫు న్యాయవాదిని అనుమతించాలన్నారు. చంద్రబాబు కనిపించే విధంగా న్యాయవాది పది మీటర్ల దూరంలో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు..
ఇక, చంద్రబాబు సీఐడీ విచారణ కోసం సెంట్రల్ జైలులో కాన్ఫరెన్స్ హాల్ సిద్ధం చేశారు జైలు అధికారులు.. పర్యవేక్షణ బాధ్యతలు డిప్యూటీ సూపరిడెంట్ కు అప్పగించారు.. 25 మంది కూర్చునేలా కాన్ఫరెన్స్ హాల్ సిద్ధం చేశారు.. సీఐడీకి చెందిన ముగ్గురు డిఏస్సీ స్థాయి అధికారులు, నలుగురు సీఐలు, ఏఎస్ఐ, కానిస్టేబుల్, వీడియోగ్రఫర్, ఇద్దరు ఆఫీషియల్ మధ్యవర్తుల సమక్షంలో ఈ విచారణ జరగనుంది.
మరోవైపు చంద్రబాబును సీఐడీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడగనున్నారు అనే చర్చ కూడా సాగుతోంది.. . ముఖ్యంగా రూ.3,300 కోట్ల ప్రాజెక్టుగా ఎలా నిర్ణయం చేశారు?.. * సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో జీవో ఎలా ఇచ్చారు?.. * అగ్రిమెంట్ ఏ విధంగా జరిగింది?.. * జీవోకి విరుద్ధంగా ఒప్పందం ఉండడం ఏంటి?.. * ఆర్థిక శాఖ అభ్యంతరాలు పట్టించుకోకుండా నిధులు విడుదల చేయమని ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏంటి? * 13 చోట్ల నోట్ పైళ్ళపై సంతకం చేసి అధికారులపై ఎందుకు ఒత్తిడి చేశారు? * డిజైన్ టెక్ కంపెనీకి చేరిన నిధులు తరలించడం గురించి మీకు తెలుసా?.. * నిధుల తరలించిన మనోజ్ పార్థసానితో ఉన్న సంబంధం ఏంటి? * మనోజ్ పార్థసాని పీఏ పెండ్యాల శ్రీనివాస్ కి రూ.241 కోట్లు ఎందుకు ఇచ్చారు?.. * ఆ నిధుల విషయం మీకు తెలుసా?.. * సీఐడీ నోటీసులు ఇవ్వగానే వారు ఇద్దరు ఎందుకు పారిపోయారు? లాంటి ప్రశ్నలు వేయనున్నారని ప్రచారం సాగుతోంది.