దర్శకుడు మోహన్.జి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ద్రౌపది 2’ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రంగం సిద్ధమవుతోంది. 14వ శతాబ్దపు దక్షిణ భారతదేశ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా, అనౌన్స్‌మెంట్ నుంచే సినీ ప్రియుల్లో భారీ క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ను పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందడంతో ప్రమోషన్ల జోరు పెరిగింది. ఈ సినిమాలో ముగ్గురు పవర్‌ఫుల్ విలన్స్ ఉండగా, అందులో చిరాగ్ జానీ పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకం. ఆయన చరిత్రలో ప్రసిద్ధి చెందిన ‘మహమ్మద్ బీన్ తుగ్లక్’ పాత్రలో కనిపించనున్నారు. చరిత్రలో తుగ్లక్‌ను ‘తెలివైన మూర్ఖుడు’ అని పిలుస్తుంటారు. ఆయన మేధస్సును, తీసుకునే వివాదాస్పద నిర్ణయాలను, గంభీరమైన ఆహార్యాన్ని చిరాగ్ అద్భుతంగా పండించారని దర్శకుడు మోహన్.జి ప్రశంసించారు.
పాలకుడిగా తుగ్లక్ పడే సంఘర్షణను, ఎదుర్కొనే సమస్యలను చిరాగ్ తన నటనతో నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. రిచర్డ్ రిషి హీరోగా, రక్షణ ఇందుసుదన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నట్టి నటరాజ్ ఒక కీలక పాత్రలో మెరవనున్నారు. వీరికి తోడుగా దేవయానీ శర్మ, వై.జి. మహేంద్రన్ వంటి అనుభవజ్ఞులైన నటీనటులు ఈ చారిత్రక గాథలో భాగమయ్యారు. గిబ్రాన్ అందించిన పాటలు ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఫిలిప్ ఆర్. సుందర్ విజువల్స్ 14వ శతాబ్దపు వాతావరణాన్ని కళ్లకు కట్టనున్నాయి. చోళ చక్రవర్తి (నేతాజీ ప్రొడక్షన్స్), జి.ఎం. ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందించారు. సెన్సార్ పూర్తవ్వడంతో, మేకర్స్ త్వరలోనే భారీ స్థాయిలో ట్రైలర్ లాంచ్ మరియు ఆడియో ఫంక్షన్‌ను నిర్వహించబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బహుభాషా చిత్రంగా విడుదల కానున్న ‘ద్రౌపది 2’ రిలీజ్ డేట్‌ను కూడా కొన్ని రోజుల్లోనే అధికారికంగా ప్రకటించనున్నారు.