AP Assembly Speaker: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నిక కోసం ఇవాళ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరిగింది. అయితే టీడీపీ నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేశారు. స్పీకర్ పదవి కోసం ఒకే ఒక నామినేషన్ రాగా.. గడువులోగా మరో నామినేషన్ దాఖలు కాలేదు. మరో నామినేషన్ రాకపోవడంతో అయ్యన్నపాత్రుడు ఎన్నిక ఏకగ్రీవం అని అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. అయ్యన్నపాత్రుడు తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ శుక్రవారం ఉదయం అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ల దాఖలుకు సాయంత్రం వరకూ గడువు ఉండగా.. గడువులోగా అయ్యన్న నామినేషన్ ఒక్కటే దాఖలైంది. దీంతో ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. శనివారం ఏపీ శాసనసభాపతిగా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
Read Also: YS Jagan Pulivendula Tour: ఎన్నికల తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి వైయస్ జగన్
అయ్యన్నపాత్రుడు టీడీపీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీ వెంటే ఉన్నారు. 1983లో తొలిసారిగా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అయ్యన్న.. ఇప్పటి వరకూ 7 సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి అనకాపల్లి ఎంపీగానూ విజయం సాధించారు. పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి 24,676 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ మీద విజయం సాధించారు.