China foreign minister Qin Gang: చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్‌కు అత్యంత సన్నిహితుడు, చైనా విదేశాంగమంత్రి క్విన్ గాంగ్ గత నెలరోజులుగా ఆచూకీ లేకుండా పోవడం చైనాలో కలకలం రేపుతోంది. విదేశాంగ మంత్రి కనిపించకుండా పోవడం సాధారణ విషయం కాదు. ఆయన ఎక్కడున్నారన్నది మీడియాకు కూడా అంతుబట్టడంలేదు. చైనా కావాలనే సీక్రెట్‌గా ఆయనను దాచి ఉంచిందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఓ పాత్రికేయురాలితో క్విన్ గాంగ్‌కు అఫైర్ ఉందన్న నేపథ్యంలో, ఆయన అదృశ్యం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత నెల 25న రష్యా, శ్రీలంక, వియత్నాంకు చెందిన కొందరు అధికారులతో ఆయన సమావేశమయ్యారు. చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ బహిరంగంగా కనిపించడం అదే చివరిసారి కావడం గమనార్హం. క్విన్ గాంగ్ వయసు 57 సంవత్సరాలు. చైనా రాజకీయాల్లో బలమైన నేతగా ఎదుగుతున్న సమయంలో ఆయన ఆచూకీ లేకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది.
Also Read: Indian Citizenship: ఈ ఏడాది భారత పౌరసత్వాన్ని ఎంత మంది వదులుకున్నారో తెలుసా..?
ఇండోనేషియా వేదికగా జరిగిన ఆసియాన్ సదస్సులో పాల్గొన్న చైనా బృందానికి వాస్తవానికి క్విన్ గాంగ్ నాయకత్వం వహించాల్సి ఉన్నా, ఆయన అదృశ్యం కావడంతో మరొకరికి ఆ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామంపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ వివరణ ఇచ్చారు. క్విన్ గాంగ్ ఆరోగ్య కారణాల రీత్యా ఇండోనేషియా వెళ్లలేకపోయారని చెప్పారే తప్ప, అంతకుమించి ఇతర వివరాలేవీ వెల్లడించలేదు. అటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరగాల్సి ఉన్నా.. వాటిని కారణం లేకుండానే వాయిదా వేసింది చైనా. ఈ సమావేశం ఇప్పట్లో సాధ్యం కాదని పేర్కొన్న చైనా, అంతకుమించి వివరణ ఇవ్వలేదు. ఇవన్నీ ఎన్నో అనుమానాలకు తెరతీశాయి.
Also Read: IND vs BAN: కోపం మాములుగా లేదు.. నాటౌట్ను ఔట్ ఇవ్వడంతో..
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడితో సమావేశమైనప్పటి నుంచి క్విన్ గాంగ్ మిస్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, చైనా దేశీయ సెర్చ్ ఇంజిన్ బైడూలో క్విన్ గాంగ్ గురించి వెతకడం విపరీతంగా పెరిగిపోయిందట. రోజుకు 3.80 లక్షల మంది ఆయన గురించి నెట్‌లో సెర్చ్ చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ మహిళా జర్నలిస్టు ఫు జావోషియాన్‌తో ప్రేమాయణం నడుపుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన అదృశ్యానికి ఈ అఫైరే కారణం అయ్యుండొచ్చని ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. కమ్యూనిస్ట్ దేశమైన చైనాలో ఇలాంటి వివాహేతర సంబంధాలకు పాల్పడడం ఆ దేశం తీవ్రంగా పరిగణిస్తుంది. ఇలాంటి కారణాలతోనే మాజీ ఉప ప్రధాని ఝాంగ్ గావోలీ కూడా దాదాపు అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు క్విన్ గాంగ్ కూడా అలాగే అదృశ్యమయ్యారేమోనని అనుమానాలు రేకెత్తుతున్నాయి.