China New Map: చైనా తన అధికారిక మ్యాప్‌ను విడుదల చేసింది. చైనా తన కొత్త మ్యాప్‌ను విడుదల చేసినప్పటి నుంటి భారత రాజకీయాల్లో వేడి పెరిగింది. ఈ కొత్త మ్యాప్‌లో భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్, తైవాన్, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రాన్ని చైనా తన భూభాగంగా చూపింది. కొత్త అధికారిక మ్యాప్‌లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లను చైనా క్లెయిమ్ చేయడంపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఇలా అన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలపై చైనా వాదన కొత్తేమీ కాదు.. ఇదేం మొదటి సారి కాదని.. వారికి మనమంటే ఏంటో చూపించాలని కానీ ఇప్పుడు అలాంటిదేం జరగడం లేదన్నారు. అనేక స్థాయిల్లో చర్చలు జరిగినా ఇలా ఎందుకు జరగుతుందని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కపిల్ సిబల్.. ‘చైనా మనకంటే పెద్ద ఆర్థిక వ్యవస్థ అని స్వయంగా విదేశాంగ మంత్రి చెప్పారు. కాబట్టి మనం పెద్దగా ఏమీ చేయలేం, చర్చలు జరిపే సామర్థ్యం మనకు లేదనిపిస్తోంది.” అని ఆయన మండిపడ్డారు.
Read Also: China: చైనా మ్యాపులపై భారత్ అభ్యంతరం.. స్పందించిన డ్రాగన్ కంట్రీ..
విదేశాంగ మంత్రి ప్రకటనలపై ఎంపీ సిబల్ మండిపడ్డారు. అనేక స్థాయిల్లో చర్చలు జరిగాయని, చైనా సేనలు వెనక్కి వెళ్లాలని విదేశాంగ మంత్రి చెబుతున్నారని… కానీ ప్రకటనల వల్ల పరిష్కారం రాదన్నారు. మనం పెద్ద ఆర్థిక శక్తిగా మారినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. అప్పుడే వారితో సమానంగా మాట్లాడగలరని విదేశాంగ మంత్రిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.
అదే సమయంలో చైనా అంశంపై కూడా రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. ప్రధానమంత్రిని ఉద్దేశించి కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ “లడఖ్‌లో ఒక్క అంగుళం భూమి కూడా పోలేదని ప్రధాని చెప్పినది అబద్ధమని.. తాను చాలా సంవత్సరాలుగా ఈ విషయం గురించి చెబుతున్నానన్నారు. చైనా మన భూమిని ఆక్రమించిందని లడఖ్ మొత్తానికి తెలుసు. . ఈ మ్యాప్ విషయం చాలా తీవ్రమైనది. వారు భూమిని లాక్కున్నారు. దాని గురించి ప్రధానమంత్రి ఏదైనా చెప్పాలి.” అని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.