ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాకిస్థాన్‌కు సైనిక మద్దతు ఇచ్చిందా? అనే ప్రశ్నపై చైనా ప్రభుత్వం స్పందించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాక్‌కు సైనిక మద్దతు అందించిందని భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ ఇటీవల పేర్కొన్నారు. ఈ యుద్ధాన్ని చైనా తన అనేక రక్షణ వ్యవస్థలను పరీక్షించడానికి ‘లైవ్ ల్యాబ్’గా ఉపయోగించుకుందని అన్నారు. ఈ అంశంపై సోమవారం, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్‌ను మీడియా ప్రశ్నించింది. చైనా, పాకిస్థాన్ పొరుగు దేశాలు అని, వాటి మధ్య సాంప్రదాయ స్నేహం ఉందని మావో నింగ్ అన్నారు. రక్షణ, భద్రతా సహకారం రెండు దేశాల మధ్య సాధారణ సహకారంలో భాగమని స్పష్టం చేశారు. ఈ యుద్ధ సమయంలో చైనా పాకిస్థాన్‌కు సైనిక సహాయం అందించలేదని మావో నింగ్ తన సమాధానంలో ఎక్కడా ఖండించలేదు. ఈ ఆరోపణ ఎలా వచ్చిందో తనకు తెలియదని.. వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు అభిప్రాయాలు ఉండవచ్చన్నారు. చైనా-పాక్ సంబంధాలు మూడో దేశాన్ని ప్రభావితం చేయవని తెలిపారు.
READ MORE: Anil Kumar Yadav: మారణాయుధాలతో దాడి.. ప్రసన్నకుమార్ ఇంటిపై 200 మందికి పైగా హత్యాయత్నం!
లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ ఏం చెప్పారు?
గత వారం ఢిల్లీలో జరిగిన ఒక సెమినార్‌లో భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన సమయంలో పాకిస్థాన్‌కు చైనా, టర్కీలు మద్దతుగా నిలిచాయన్నారు. ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన సమయంలో పాకిస్థాన్‌ను చైనా ఎప్పటికప్పుడు సమాయత్తం చేసిందన్నారు. భారత్‌కు ఒక సరిహద్దు.. ఇద్దరు శుత్రువులు ఉన్నారన్నారు. కానీ నిజానికి ముగ్గురు శత్రువులు అని ఆయన వివరించారు. అందులో పాకిస్థాన్ ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు చైనా అన్ని విధాలుగా మద్దతు ఇస్తుందన్నారు. పాకిస్థాన్ మిలటరీ వినియోగిస్తున్న హార్డ్‌వేర్‌లో 81 శాతం చైనాకు చెందినవేనని ఈ సందర్భంగా ఆయన సోదాహరణగా వివరించారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ భారత్‌పై పాక్ నిర్వహించిన దాడుల్లో చైనా తన ఆయుధాలను పరీక్షించుకుందని చెప్పారు. అదే సమయంలో పాకిస్థాన్‌కు టర్కీ సైతం అదే తరహాలో సహాయం చేసిందన్నారు. ఈ యుద్ధంలో టర్కీ పైలట్లు నేరుగా పాల్గొన్నారని వివరించారు.