Pakistan: పాకిస్తాన్‌లోకి చైనా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు రంగ ప్రవేశం చేశాయి. ఇటీవల కాలంలో పాకిస్తాన్ వ్యాప్తంగా చైనా జాతీయులను టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) వంటి ప్రాజెక్టులలో పనిచేస్తున్న తన జాతీయుల భద్రతను నిర్ధారించడానికి చైనా ఒక ముఖ్యమైన చర్య తీసుకుంది. పెరుగుతున్న దాడుల కారణంగా తమ పౌరులకు మెరుగైన సెక్యూరిటీ అందించేందుకు చైనా మూడు ప్రైవేట్ భద్రత సంస్థలతో ఒక ఒప్పందం చేసుకుంది. చైనా పౌరులపై దారుణమైన దాడుల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.
అక్టోబర్ 06న బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి బాంబు దాడిలో ఇద్దరు పౌరులు మరణించిన తర్వాత చైనా, పాకిస్తాన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా కేవలం పాక్ బలగాలపై ఆధారపడకుండా తన సొంత భద్రతా సిబ్బందిని మోహరించాలని నిర్ణయించుకుంది. చైనా ప్రభుత్వం మూడు ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీలను-డ్యూయీ సెక్యూరిటీ ఫ్రాంటియర్ సర్వీస్ గ్రూప్, చైనా ఓవర్సీస్ సెక్యూరిటీ గ్రూప్ మరియు హుయాక్సిన్ జాంగ్‌షాన్ సెక్యూరిటీ సర్వీస్‌లను తమ పౌరుల భద్రతకు పాకిస్నా్‌తో దింపింది. ఈ సెక్యూరిటీ సంస్థల్లో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)కి చెందిన రిటైర్డ్ అధికారులు ఉంటారు. వీరంతా సీపెక్ ప్రాజెక్ట్, గ్వాదర్ పోర్టు వంటి సున్నిత ప్రాంతాల్లో భద్రతా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
Read Also: Caste Enumeration : తెలంగాణ సర్వే దేశానికే ఆదర్శం.. కోటి మైలురాయి దాటిన ఇంటింటి కుటుంబ సర్వే
నిజానికి చైనా ఆర్మీని తమ గడ్డపై అనుమతించడానికి పాకిస్తాన్ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ భద్రతా సంస్తల వైపు చైనా మొగ్గు చూపింద. ఈ సంస్థలు చైనీస్ ఆర్మీతో బలమైన సంబంధాలను కలిగి ఉన్నాయి. ఈ సెక్యూరిటీ సర్వీసులు వేరే దేశాల్లో పనిచేయడం కొత్త కాదు. డ్యూయీ సెక్యూరిటీ గ్రూప్, గతంలో కెన్యా, సూడాన్ మరియు ఇథియోపియా వంటి దేశాలలో చైనా ప్రాజెక్టులకు భద్రతను అందించింది. అదేవిధంగా, చైనా ఓవర్సీస్ సెక్యూరిటీ గ్రూప్ టర్కీ, థాయ్‌లాండ్ మరియు దక్షిణాఫ్రికాతో సహా అనేక ప్రాంతాలలో పనిచేసింది. మూడవ కంపెనీ, హుయాక్సిన్ జాంగ్‌షాన్ సెక్యూరిటీ సర్వీస్, సముద్ర భద్రతలో ప్రత్యేకత కలిగి ఉంది. ఇది CPEC భాగమైన గ్వాదర్ పోర్ట్ రక్షణను పర్యవేక్షిస్తుంది.
సీపెక్ ప్రాజెక్ట్ పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టుని, చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సులను కలుపుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా రోడ్డు, రైలు నిర్మాణాలను చేపడుతోంది. 60 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ విలువతో ఈ ప్రాజెక్టుని చైనా చేపడుతోంది. అయితే, ఈ ప్రాజెక్టు బలూచిస్తాన్ ప్రావిన్సు నుంచి వెళ్తోంది. ఈ ప్రాంతంలోని ప్రజలు పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుతున్నారు. ఈ ప్రాంతంలోని సహజవనరుల్ని పాకిస్తాన్,చైనా దోపిడి చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి వేర్పాటువాద గ్రూపులు చైనీయులను, పాకిస్తాన్ ఆర్మీ, పోలీసుల్ని టార్గెట్ చేస్తూ దాడులకు చేస్తున్నాయి.