Ranjith Reddy: చేవెళ్ళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి జోరు పెంచారు. టికెట్ ప్రకటించిందే ఆలస్యంగా పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఊరు, వాడ తిరుగుతున్నారు. ఇప్పటివరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు చుట్టేయగా.. దాదాపు ప్రతి నియోజకవర్గంలో బూతు కమిటీల మీటింగ్.. ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నారు. శుక్రవారం తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితోపాటు బషీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో రంజిత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు బషీరాబాద్ మండలంలోని ఏకాంబరేశ్వర స్వామి వారి దేవస్థానంలో పూజలు నిర్వహించిన తర్వాత స్ట్రీట్ కార్నర్ మీటింగులలో పాల్గొన్నారు. బషీరాబాద్ మండల కేంద్రంలోని మైల్వర్,ఏక్మమై దామర్చేడ్, నవల్గ, గొట్టిగ కుర్థు కాశీంపూర్, మంతటి గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా… కాంగ్రెస్ కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
Read Also: Revanth Reddy: భద్రాద్రి రామయ్య సాక్షిగా హామీ ఇస్తున్నా.. ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తా..
ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి రంజిత్ రెడ్డి ప్రసంగించారు. రానున్న రోజుల్లో జరిగే పార్లమెంటు ఎన్నికలలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని… కాంగ్రెస్ పార్టీ విజయంలో భాగస్వామ్యం కావాలని స్పష్టం చేశారు. కార్యకర్తలు ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని తెలపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని… ఆ వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటికి ఆరు గ్యారంటీలు తీసుకువస్తుందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని గుర్తు చేయాలన్నారు. కాగా, ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే రైతులకు రుణమాఫీ జరుగుతుందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజల కోసం నిత్యం అందుబాటులో ఉంటూ కష్టపడుతూ చేవెళ్ల నియోజకవర్గం ప్రగతి బాటలు వేస్తామన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు శోభ, ఎంపీపీ అరుణ ప్రసాద్ రెడ్డి, జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు,సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.