Chandrababu: తెలుగు జన విజయకేతన సభ ఇది అని.. తాడేపల్లిగూడెం సభ చరిత్రను తిరగరాస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. మన పోరాటం వైసీపీ దొంగలపై అన్న ఆయన.. తాడేపల్లిగూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపిస్తుందన్నారు. మేము చేతులు కలిపింది మా కోసం కాదని.. రాష్ట్ర భవిష్యత్తు కోసమని.. హత్యకు గురైన ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కలసి పోరాటం చేస్తున్నామని చంద్రబాబు టీడీపీ-జనసేన పొత్తు గురించి వ్యాఖ్యానించారు. ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు అని.. మేం చేతులు కలిపింది అధికారం కోసం కాదు, ప్రజల కోసమని.. భవిష్యత్‌కు నాందీ పలకాల్సిన బాధ్యత మనపై ఉందని చంద్రబాబు అన్నారు. ప్రజావేదిక కూల్చి పాలన మొదలు పెట్టారని.. ఇది వైసీపీ నైజమని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు.
Read Also: Andhrapradesh: ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ వీఆర్‌ఎస్‌కు ఏపీ సర్కార్ ఆమోదం
క్రికెటర్ హనుమ విహారి వైసీపీ వేదింపులు తట్టుకోలేక పారిపోయాడని ఆరోపించారు. రాజకీయ వ్యాపారం చేస్తున్న ముఖ్యమంత్రికి అడ్డువస్తే చంద్రబాబు, పవన్, ప్రజలు ఎవరినీ లెక్కచేయడం లేదని ఆయన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఉండాలని సీఎం కోరుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. ఏమి పొడిచారని వై నాట్ 175 అంటున్నారని.. మేము అడుగుతున్నాం.. వై నాట్ జ్యాబ్ క్యాలండర్, వై నాట్ ఉచిత ఇసుక, వై నాట్ డీఎస్సీ.. జగన్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. జగన్ ది ఫ్లాప్ సినిమా.. దీనికి సీక్వెల్ ఉండదన్నారు. వైసీపీ రౌడీలకి 40రోజుల తర్వాత అసలు సినిమా చూపిస్తామన్నారు. జనసేన, టీడీపీ సూపర్ విన్నింగ్ టీమ్.. వైసీపీ సిట్టింగ్ టీమ్ అంటూ చంద్రబాబు అన్నారు. బాధ్యతగా అభ్యర్థుల ఎంపిక చేస్తున్నాం.. మా అభ్యర్థులను చూశాక వైసీపీలో భయం పట్టుకుందన్నారు. కూటమి అభ్యర్థులను చూసి మళ్ళీ అభ్యర్థులను మార్చుతాం అంటున్నారంటూ ఎద్దేవా చేశారు. బీసీ, ఎస్సీ డిక్లరేషన్ ఇస్తామన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తామన్నారు. కోరుకున్న అందరికీ సీట్లు ఇవ్వలేమన్న ఆయన.. పని చేసిన నాయకులకు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామన్నారు. ఒక పార్టీ వెనుక మరొక పార్టీ నడవడంలేదు.. రెండు సమానంగా వెళ్తున్నాయన్నారు. నాయకులు ఎవ్వరూ ఈగోలకు పోకూడదన్నారు.పొత్తు సూపర్ హిట్స్.. ఆంధ్రప్రదేశ్ అన్ స్టాపబుల్ అని చంద్రబాబు స్పష్టం చేశారు.