Srisailam: శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం అభివృద్ధిపై దేవావయా, అటవీశాఖలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నతాధికారులు హాజరయ్యారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఆలయ సమగ్రాభివృద్ధిపై చర్చ జరిగింది. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై చర్చించారు. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆధ్యాత్మికంగా, పర్యాటక ప్రాంతంగా, పర్యావరణ పరంగా శ్రీశైలం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. దేవాలయ అభివృద్ధి కోసం 2 వేల హెక్టార్ల భూమిని దేవాదాయశాఖకు కేటాయించేలా కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. శ్రీశైల క్షేత్రానికి జాతీయ రహదారులను అనుసంధానించేలా ప్రణాళికలు చేయాలని సీఎం ఆదేశించారు. శ్రీశైలంలోని పులుల అభయారణ్యం అభివృద్ధికి సూచనలు చేశారు. భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతున్న కారణంగా… ఆలయ సమగ్రాభివృద్ధికి సత్వర చర్యలు అవసరమని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న సందర్భంగా సౌకర్యాలు విస్తరించాలని సూచించారు. శబరిమల సహా ఇతర దేవాలయాల్లో సౌకర్యాలను పరిశీలించి శ్రీశైలాన్ని అభివృద్ధి చేద్దామన్నారు.
మరోవైపు.. శ్రీశైల మహాక్షేత్రం అభివృద్ధికి నూతన ప్రతిపాదనలను దేవస్థానం అధికారులు సిద్ధం చేశారు. ఈ నెల 16న ప్రధాని మోడీ శ్రీశైలం దర్శనానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మల్లన్న ఆలయానికి రూ.1,657 కోట్ల ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆధ్వర్యంలో ప్రధానిని కోరనున్నారు. కాశీ క్షేత్రంలో కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయిని మహాకాళ్ కారిడార్ తరహాలో శ్రీశైల క్షేత్ర కారిడార్‌ను అభివృద్ధి చేయడానికి సదరు నిధులు వినియోగించాలని దేవాదాయశాఖ, దేవస్థానం అధికారులు యోచిస్తున్నారు.