Chandrababu: బీసీల్లో ఎంత మందికి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వగలమో అంతమందికి ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ఆధ్వర్యంలో ‘జయహో బీసీ’ వర్క్ షాప్ జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రసంగించారు. సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా బీసీలను పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదని ఆయన పేర్కొన్నారు. బీసీ సోదరుల జోలికి వచ్చే ధైర్యం ఎవ్వరూ చేయకూడదనే మేనిఫెస్టోలో బీసీ రక్షణ చట్టం చేస్తామనే హామీనిచ్చామన్నారు. బీసీ ఉప ప్రణాళిక కింద రూ.75 వేల కోట్లు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశాడా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.
Read Also: PM Modi: లక్షదీవుల్లో ప్రధాని స్నార్కెలింగ్ సాహసం.. ఫొటోలను పంచుకున్న మోడీ
తెలుగుదేశం పార్టీ నిర్మించిన బీసీ భవనాలను పూర్తి చేయలేని అసమర్థుడు 3 రాజధానులు కడతానన్నాడని.. సుప్రీంకోర్టులోనూ 3 రాజధానుల కథ ముగిసిపోయిందన్నారు. బీసీలకు తెలుగుదేశం అమలు చేసిన 30 సంక్షేమ పథకాలను జగన్ రెడ్డి రద్దు చేసి, వారి ఆర్థిక స్థితి గతులపై దెబ్బకొట్టాడని ఆయన ఆరోపించారు. 5ఏళ్లలో బీసీలకు ఒక్క హామీ కూడా అమలు చేయని ప్రభుత్వం, ఏ ముఖం పెట్టుకుని బీసీ సామాజిక యాత్రకు తయారైందని చంద్రబాబు అన్నారు. అడుగడుగునా బీసీలను వేధించిన ఏకైక పార్టీ వైసీపీ అన్న ఆయన.. తెలుగుదేశం పార్టీ బీసీ నాయకత్వాన్ని తయారు చేసే విశ్వ విద్యాలయం అని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ కార్యక్రమాల వల్ల లాభపడింది జగన్ కంపెనీలు మాత్రమేనని విమర్శించారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. “జగన్ చేసిన సామాజిక న్యాయంలో విజయసాయి, సజ్జల, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మినహా మరే రెడ్డీ కూడా బాగుపడలేదు. రూ.10 ఇచ్చి రూ. 100 దోచుకోవడం జగన్ నైజం. నేను అవసరమైతే రూ. 15 ఇచ్చి రూ. 100 సంపాదించుకొనే మార్గం చూపిస్తా. రాష్ట్ర పునర్నిర్మాణం, పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత అందరిపైనా ఉంది.” అని ఆయన పేర్కొన్నారు.