Chandrababu: రేపు ఎన్నికల ఫేజ్-1 మేనిఫెస్టో ప్రకటిస్తాం.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సైకిల్ సిద్దంగా ఉంది అని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాజమండ్రిలో జరుగుతోన్న టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు రెడీగా ఉన్నాం.. జరిగేది కురుక్షేత్రం.. అజాగ్రత్త వద్దు అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.. నౌ ఆర్ నెవ్వర్.. కురుక్షేత్ర యుద్దంలో వైసీపీ కౌరవులను ఓడించాలన్న ఆయన.. రాష్ట్రంలో పిచ్చొడి చేతిలో రాయి ఉంది. ఆ రాయి పేదలకు తగలకుండా అడ్డం పడతాం అన్నారు. ఆ రాయితోనే చిత్తు చిత్తుగా కొడతాం. పేదల సంక్షేమానికి.. రాష్ట్రాభివృద్ధికి ఏం చేయాలో టీడీపీకి తెలుసన్నారు.. సంపద సృష్టిస్తాం.. పేదలకు పంచుతాం. పేదవాడు ధనికుడు కావడమే నా ఆశయం. కానీ, తాను ధనికుడు కావాలి.. మిగిలిన వాళ్లు పేదలుగా ఉండాలని అనేది జగన్ ఆలోచన అంటూ విమర్శలు గుప్పించారు.
Read Also: New Parliament Building: కొత్త పార్లమెంటు భవనంలో స్మార్ట్ టెక్నాలజీ.. ఎక్కడా పేపర్ కనిపించదు
నాలుగేళ్లల్లో రూ. 2.47 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు చంద్రబాబు.. ఏపీలో సంపద దోపిడీ ఎక్కువ.. ధరల బాదుడు ఎక్కువన్న ఆయన.. స్కామ్‌లలో మాస్టర్ మైండ్ జగన్‌ది.. జగన్ నోరు తెరిస్తే అబద్దాలే. కోడికత్తి డ్రామా.. మద్య నిషేధం వంటివన్నీ డ్రామాలే అని ఆరోపించారు.. రావణాసురుడు సాధువు రూపంలో వచ్చి సీతను ఎత్తుకెళ్లినట్టు.. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ఓట్లేయించుకున్నారన్న ఆయన.. రూ. 2 వేల నోట్లన్నీ జగన్ దగ్గరే ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. పెద్ద నోట్ల రద్దుకు టీడీపీ కట్టుబడి ఉంది. సంక్షేమం తెలుసు.. సంపద సృష్టి తెలుసు. అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టింది టీడీపీనే అని గుర్తు చేశారు. పేదలకు ఫించన్లివ్వడం మొదలు పెట్టింది టీడీపీనే.. టీడీపీ విజన్ ఏంటో హైదరాబాద్ చూస్తే తెలుస్తుందన్నారు.
Read Also: BSc Nursing Notification: ఆర్టీసీ దవఖానాలో బీఎస్సీ నర్సింగ్.. అడ్మిషన్లు షురూ
ఇక, ఇరిగేషనుకు రూ.64 వేల కోట్లు ఖర్చు పెట్టాం. నాలుగేళ్ల క్రితం కొత్తగా వచ్చాడు.. ఒక్క ఛాన్స్ అన్నాడు. కోడి కత్తి అన్నాడు.. డ్రామా ఆడాడు.. రాష్ట్రాన్ని నాశనం చేయడం ప్రజా వేదిక నుంచే ప్రారంభించాడని విమర్శించారు చంద్రబాబు.. అన్ని వ్యవస్థలను నాశనం చేశాడు.. ప్రపంచ చరిత్రలో ఎక్కడా రాజధాని లేని రాష్ట్రం లేదన్నారు. పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు. రోడ్లు ఆధ్వాన్నంగా మారాయి. ప్రభుత్వ స్పాన్సర్డ్ టెర్రరిజం పెరిగింది. పెట్టుబడులు లేవు.. జాబ్ క్యాలెండర్ లేదు. నిరుద్యోగులకు దిక్కు తోచడం లేదు. లేని దిశా చట్టాన్ని అమలు చేస్తున్నాడట. ప్రత్యేక హోదా కోసం మెడలు వంచుతానన్నాడు.. కేసుల కోసం సాష్టాంగం చేశాడు. మద్యపాన నిషేధం పెడతానన్న పెద్ద మనిషి మద్య ఆదాయాన్నే తాకట్టు పెట్టాడు అంటూ ధ్వజమెత్తారు.
Read Also: Karnataka Cabinet: కర్ణాటకలో కొత్తగా 24 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
అన్ని రంగాల్లోనూ ఏపీ వెనుకడుగులోనే ఉందన్నారు చంద్రబాబు.. పుట్టబోయే బిడ్డ పైనా అప్పు వేసేలా ఉన్నారన్న ఆయన.. ఏపీ సీఎం ధనికుడు.. ఏపీ ప్రజలు పేదలు అన్నారు. ఇసుక లేకపోవడం వల్ల పనుల్లేక భవన నిర్మాణ కార్ముకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తిరుమలలో గంజాయి వ్యాపారం చేస్తున్నారు. అడవి బిడ్డలు దారిలోనే ప్రసవించేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ ముందుకెళ్తాం.. తెలుగు జాతి చరిత్ర తిరగరాసే రోజు ఇది అని పేర్కొన్నారు చంద్రబాబు.. టీడీపీ జెండా.. తెలుగు జాతి అజెండా.. సంక్షేమం, అభివృద్ధి టీడీపీ సైకిలుకున్న రెండు చక్రాలుగా అభివర్ణించారు. నాలుగేళ్లపాటు టీడీపీ కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడినా ఎవ్వరూ భయపడలేదు. జై జగన్ అంటే వదిలేస్తామన్నా.. వినకుండా జై తెలుగుదేశం అంటూ ప్రాణాలొదిలిన కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తల త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నా అన్నారు.. భవిష్యత్తులో కార్యకర్తలని ఆదుకునే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు.