Site icon NTV Telugu

Champions Trophy 2025: హమ్మయ్య.. పాకిస్థాన్‌కు రోహిత్‌ వెళ్లాల్సిన అవసరం లేదు!

Rohit Sharma Fitness

Rohit Sharma Fitness

ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ ఆరంభోత్సవాన్ని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కలిసి ఫిబ్రవరి 16న లాహోర్‌లో నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమంకు చారిత్రక లాహోర్‌ కోటలోని హుజూరి బాగ్‌ వేదిక కానుంది. అయితే ఐసీసీ టోర్నీ ఆరంభానికి ముందు సంప్రదాయంగా వస్తున్న అన్ని జట్ల కెప్టెన్ల ఫొటోషూట్, మీడియా సమావేశాన్ని ఈసారి నిర్వహించడం లేదని తెలుస్తోంది.

ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు ప్రధాన జట్లు మ్యాచ్‌లతో బిజీగా ఉన్న కారణంగా కెప్టెన్ల ఫొటోషూట్ నిర్వహించడం లేదని పీసీబీ వర్గాలు తెలిపాయి. ‘ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు అన్ని జట్లకు తీరిక లేని షెడ్యూల్‌ ఉంది. భారత్‌తో ఇంగ్లండ్ వన్డే సిరీస్‌ ఆడనుంది. శ్రీలంకలో పర్యటనలో ఆస్ట్రేలియా ఉంది. టోర్నీకి ముందు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీమ్స్ పాక్ చేరుకుంటాయి. సమయం లేకపోవడంతో కెప్టెన్ల ఫొటోషూట్, విలేకర్ల సమావేశం నిర్వహించడం లేదు’ అని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. కెప్టెన్ల ఫొటోషూట్ లేకపోవడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ పాకిస్థాన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది.

ఫిబ్రవరి 19 నుంచి ఆరంభం అయ్యే ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో ఎనమిది టీమ్స్ తలపడనున్నాయి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ టోర్నీ జరగబోతోంది. టోర్నీకి పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇస్తోంది. గ్రూప్‌ Aలో భారత్‌ సహా పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో, ఫిబ్రవరి 23న పాకిస్థాన్తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత్ దుబాయ్‌ వేదికగా తలపడనుంది. చివరిసారిగా 2013లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో భారత్ విజేతగా నిలిచింది.

Exit mobile version