Champai Soren: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ జార్ఖండ్ ముక్తీ మోర్చా(జేఎంఎం) పార్టీకి రాజీనామా చేశారు. తాను పార్టీ మారబోతున్నట్లు ప్రకటించిన ఆయన ఈ రోజు రాజీనామా చేశారు. తాను బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత ఆయన తన పార్టీకి రాజీనామా చేశారు. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని పార్టీ దిక్కులేనిదిగా మారినందుకు తాను బలవంతంగా వైదగొగాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. జార్ఖండ్ ప్రజల తరుపున పోరాడుతూనే ఉంటానని ఆయన అన్నారు. “JMM నాకు ఒక కుటుంబం లాంటిది మరియు నేను పార్టీని వీడుతానని కలలో కూడా అనుకోలేదు. కానీ గత కొన్ని రోజులుగా జరిగిన కొన్ని విషయాలు నన్ను చాలా బాధపెట్టాయి మరియు ఈ కష్టమైన చర్య తీసుకోవలసి వచ్చింది” అని సోరెన్ అన్నారు.
Read Also: Mehbooba Mufti: నేను కాశ్మీర్ ఎన్నికల్లో పోటీ చేయను.. మెహబూబా ముఫ్తీ షాకింగ్ నిర్ణయం.. కారణం ఇదే..
భూ కుంభకోణం కేసులో ఈడీ హేమంత్ సోరెన్‌ని అరెస్ట్ చేసిన తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపాయ్ సోరెన్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే, హేమంత్ సోరెన్‌కి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మళ్లీ ఆయన సీఎం అయ్యారు. అయితే, ఈ అధికార మార్పిడి సమయంలో తనను తీవ్రంగా అవమానించారనేది చంపాయ్ సోరెన్ ప్రధాన ఆరోపణ. తనకు తెలియకుడా కేబినెట్ మీటింగ్, ఎమ్మెల్యేల సమావేశాలు నిర్వహించారని తనను అవమానకరంగా పదవి నుంచి తొలగించినట్లు ఆయన ఆవేదన వ్యక్తి చేశారు. ఈ క్రమంలో బీజేపీకి ఆయన దగ్గరయ్యారు. ఆదివాసీలకు బీజేపీతోనే న్యాయం జరుగుతుందని చెప్పారు. జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వాలు సంతాల్ పరగణాలో బంగ్లాదేశ్ చొరబాట్లను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజుల మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో కీలకమైన చంపాయ్ సోరెన్ జేఎంఎంని వీడటం ఆ పార్టీకి తీవ్రమైన దెబ్బగా పరిగణిస్తున్నారు. బీజేపీ తన పార్టీని డబ్బుతో విభజించాలని చూస్తోందని సీఎం హేమంత్ సోరెన్ విమర్శించారు. రాజీనామా చేసిన చంపాయ్ సోరెన్ ఆగస్టు 30న బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.