Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. వచ్చే నెల ఆఖరులో మూడు విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరగబోయే తొలి ఎన్నికలు ఇవే. ఇదిలా ఉంటే, కాశ్మీరీ కీలక నేత, మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(పీడీపీ) అధినేత మెహబూబా ముఫ్తీ తాను ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రి అయినప్పటికీ పార్టీ ఎజెండాను అమలు చేయడం సాధ్యం కాదని అన్నారు. ఆమెకు బదులుగా తన కుమార్తె ఇల్తిజా ముఫ్తీ ఈ సారి అరంగ్రేట్ం చేయబనున్నారు.
అయితే, ఇందుకు కారణాలను కూడా ముఫ్తీ వివరించారు. ‘‘12,000 మంది వ్యక్తులపై (2016లో) ఎఫ్ఐఆర్‌లను ఉపసంహకరించుకున్న బీజేపీ ప్రభుత్వంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నానని, ఇప్పుడు మనం ఆ పని చేయగలమా..? ’’ అని ప్రశ్నించారు. ‘‘పీఎం మోడీతో కూడిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండీ వేర్పాటువాదులను చర్చలకు ఆహ్వానించానని, మీరు ఇది చేయగలరా..? నేను ఈ నేలపై కాల్పుల విరమణ అమలు చేశాను, మీరు ఈ రోజు చేయగలరా..? మీరు ముఖ్యమంత్రి అయితే ఎఫ్ఐఆర్‌లు వెనక్కి తీసుకోలేని పదవి ఎందుకు..?’’ అని ఆమె అన్నారు.
READ ALSO: JK Floods: జమ్మూకాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. ఇద్దరి పిల్లలతో ప్రవాహంలో కొట్టుకుపోయిన తల్లి
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మాట మార్చడంపై ఆమె మాట్లాడుతూ.. ఒక ప్యూన్ బదిలీ కోసం లెఫ్టినెంట్ గవర్నర్ డోర్ వద్ద వేచి ఉండాల్సి ఉంటుందని అతనే స్వయంగా చెప్పాడు, నేను ప్యూన్ ట్రాన్స్‌ఫర్‌పై బాధపడటం లేదని, మనం మన ఎజెండాను అమలు చేయగలమా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్-ఎన్సీ పొత్తుపై స్పందిస్తూ, మేము ఎల్లప్పుడు ఒంటరిగా పోరాడుతాము అని చెప్పారు.
ఇదిలా ఉంటే, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ప్రస్తుతం రద్దు కాబడిన ఆర్టికల్ 370, 35 ఏ తిరిగి తీసుకువస్తామనే హామీ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇటు పీడీపీ అటు నేషనల్ కాన్ఫరెన్స్ రెండూ ఈ రెండింటిని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చాయి. భారత్-పాక్ మధ్య దౌత్యపరమైన చర్చలు ప్రారంభించడంతో పాటు కాశ్మీరీ పండిట్లు కాశ్మీర్ లోయకు గౌరవప్రదంగా తిరిగి వచ్చేలా చేస్తామని పీడీపీ హామీ ఇచ్చింది. చివరిసారిగా 2014లో అవిభాజిత జమ్మూకాశ్మీర్‌కి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ 12 స్థానాలు గెలుపొందగా, పీడీపీ 28 సీట్లు, బీజేపీ 25 సీట్లు గెలుచుకుంది. పీడీపీ-బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2019లో రాష్ట్రానికి రాజ్యాంగం కింద ఇచ్చిన ప్రత్యేక హోదాను రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.