దేశంలోని పలు ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీలోని బద్వేల్, తెలంగాణలోని హుజురాబాద్ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కోడ్ ఉల్లంఘనలు జరుగుతుండటంపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఎన్నికలు జరిగే నియోజకవర్గంపై ప్రభావం చూపేలా పక్క నియోజకవర్గాలలో పలు రాజకీయ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Also: బద్వేల్ ఉపపోరు…ఆ రెండు పార్టీలకు షాక్ తప్పదా?
దీంతో ఉప ఎన్నికలు జరిగే నియోజవర్గం ఉన్న జిల్లా అంతటా ఎన్నికల కోడ్ అమలు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర రాజధానులు, మెట్రో నగరాలు మినహా అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గం ఉన్న జిల్లా అంతటా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుందని సీఈసీ తెలిపింది. ఆయా నియోజకవర్గం వెలుపల జిల్లాలో నిర్వహించే ఎన్నికల కార్యక్రమాల ఖర్చులను అభ్యర్థుల ఖర్చుగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది. కాగా బద్వేలు, హుజురాబాద్ నియోజకవర్గాల్లో అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది.