Rammohan Naidu: రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కించాలంటే కేంద్రం సాయం అవసరమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎంపీలకు కొన్ని కొన్ని శాఖలు కేటాయించారని.. కేటాయించిన శాఖలకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత ఎంపీలపై ఉందన్నారు. వివిధ స్కీంల వచ్చే కింద కేంద్ర నిధులను ఏపీకి రప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. గత ఐదేళ్లల్లో కేంద్ర నిధుల్లోనూ అవకతవకలు జరిగాయని కేంద్ర మంత్రులే స్వయంగా సీఎం దృష్టికి తెచ్చారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదని కేంద్ర మంత్రి తెలిపారు. టీడీపీ పార్లమెంటరీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్‌కు భూమి విషయంలో ఉన్న సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
Read Also: AP Rains: రాబోయే 2 రోజులు ఏపీలో వానలే వానలు..!
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సరిగా లేదనే విషయం కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని.. కేంద్ర బడ్జెట్ ఏపీకి న్యాయం జరిగేలా ఉంటుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేంద్ర పథకాలకు రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు ఇస్తామన్నారు. ఏపీలో వెనుకబడిన జిల్లాలు ఉన్న క్రమంలో రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో వెసులుబాటు కల్పించమని కేంద్రాన్ని కోరతామన్న ఆయన.. కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నామన్నారు. మైక్రో సాఫ్ట్ ఎర్రర్ సమస్య తొలగిందన్నారు. విమానాలన్నీ ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారమే నడుస్తున్నాయని కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత ఉంది: కేశినేని చిన్ని
ఎంపీలకు కొన్ని శాఖలు కేటాయించారని.. మాకు కేటాయించిన శాఖలకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత మాపై ఉందని బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. వివిధ శాఖల మంత్రులతో.. కార్యదర్శులతో సమన్వయం చేసుకుంటామన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ పార్లమెంటరీ భేటీలో చర్చించినట్లు చెప్పారు. పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాల్లో మా నియోజకవర్గాల సమస్యలపై ప్రస్తావిస్తామన్నారు. జగన్ ఢిల్లీకి వెళ్లి అన్ని అసత్యాలే చెప్పబోతున్నారని.. ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ కు హై ప్రయార్టీ ఇస్తోందని ఎంపీ విమర్శించారు. ఏపీలో ఇప్పటి వరకు నాలుగు రాజకీయ హత్యలే జరిగాయి.. ఆ సంఘటనల్లో టీడీపీ నేతలు కూడా బాధితులుగా ఉన్నారన్నారు. ఢిల్లీ వేదికగానే తాము కూడా జగన్ దుష్ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు.