Cabinet Sub Committee: 317 జీవోపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. 317 జీవోపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదిక అందజేయాలని నిర్ణయించింది. ఈరోజు జరిగిన సమావేశంలో కొన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి సమాచారం అందించినా.. మరికొన్ని శాఖల నుంచి 317 జీవో బాధిత ఉద్యోగులకు సంబంధించిన నిర్దిష్టమైన సమాచారం రావాల్సి ఉందని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది.
Read Also: CM Revanth Reddy: పంచాయతీ రాజ్ శాఖపై సీఎం సమీక్ష.. పంచాయతీ ఎన్నికలపై కీలక నిర్ణయం?
317 జీవో కింద వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన మీదట 30 నుండి 40 శాతం మంది ఉద్యోగులు చేసుకున్న దరఖాస్తులు పునరావృత్తం అయినట్టు గుర్తించింది. 317 జీవో వెసులుబాటుకు ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలనే ఉద్దేశానికి వ్యతిరేకంగా కొంతమంది ఈ వెసులుబాటును ఉపయోగించుకొని వారి వారి సొంత జిల్లాకు పోవాలనే ప్రయత్నంలో కమిటీ దృష్టికి తెచ్చారు. ఎవరికైతే 317 జీవోలో అన్యాయం జరిగిందో వారికి న్యాయం చేయాలనే సంకల్పంతో వారిని గుర్తించి వారి వివరాలను త్వరలో కమిటీకి అందజేయాలని అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది.