Bazball: ఆస్ట్రేలియాలో జరిగిన 2025–26 యాసిస్ సిరీస్ ఇంగ్లండ్‌కు మరోసారి నిరాశనే మిగిల్చింది. సిడ్నీ టెస్ట్‌లో ఐదు వికెట్ల తేడాతో ఓడి సిరీస్‌ను 1–4తో చేజార్చుకున్న తర్వాత ‘బజ్‌బాల్’ ఫిలాసఫీపై పెద్ద చర్చ మొదలైంది. కెప్టెన్ బెన్ స్టోక్స్ స్వయంగా ఈ దూకుడు విధానం ఇప్పుడు ప్రత్యర్థులకు అర్థమైపోయిందని అంగీకరించడం.. ఇప్పుడు ఇంగ్లండ్ క్రికెట్‌లో మార్పుల అవసరాన్ని స్పష్టంగా సూచిస్తోంది.
సిరీస్ ఓటమి అనంతరం కెప్టెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. మేము బ్యాటింగ్‌లో బాగానే కనిపించిన ప్రతిసారి ప్రత్యర్థులు ఒకే తరహా వ్యూహాలతో మాపై ఆధిపత్యం చూపిస్తున్నారని అన్నాడు. ఈ వ్యాఖ్యలు బజ్‌బాల్ ఇక పాత ఫార్ములాగా మారుతోందా? అన్న సందేహాలకు బలాన్నిచ్చాయి. సిడ్నీ టెస్ట్‌లో ఆస్ట్రేలియా కేవలం 160 పరుగుల లక్ష్యాన్ని ఐదో రోజు చేధించడం ఇంగ్లండ్ బలహీనతలను మరోసారి బహిర్గతం చేసింది. మార్నస్ లబుషేన్, జేక్ వెదరాల్డ్ మ్యాచ్‌ను సులువుగా ముగించగా.. ఇంగ్లండ్ బౌలింగ్, ఫీల్డింగ్ ప్రభావం చూపలేకపోయింది. ఆస్ట్రేలియా పరిస్థితులకు తగ్గట్టు ఆడలేకపోవడమే ఇంగ్లండ్ పరాజయానికి ప్రధాన కారణంగా మారింది.
ఈ పరాజయంతో బజ్‌బాల్ భవిష్యత్తుపై విమర్శలు ఊపందుకున్నాయి. మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ వంటి వారు కూడా అతి దూకుడైన విధానానికి స్వల్ప మార్పులు అవసరమని బహిరంగంగా సూచిస్తున్నారు. స్టోక్స్ మాత్రం బాధ్యత నుంచి తప్పించుకోకుండా.. తాను కెప్టెన్‌గా “పెద్ద తప్పులు” చేశానని ఒప్పుకున్నాడు. అయితే ఇది నిందారోపణల సంస్కృతి కాదని, బాధ్యత తీసుకుని ముందుకు వెళ్లడమే లక్ష్యమని స్పష్టం చేశాడు.
ఇదిలా ఉండగా.. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆషెస్ పరాజయంపై సమగ్ర సమీక్ష ప్రారంభించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి ఈసీబీ సీఈఓ రిచర్డ్ గోల్డ్ మాట్లాడుతూ.. ఈ టూర్ నుంచి చాలా పాఠాలు నేర్చుకోవాలి. మా లక్ష్యం 2027లో స్వదేశంలో యాసిస్ ను తిరిగి గెలుచుకోవడం. టూర్ ప్లానింగ్, ఆటగాళ్ల ప్రదర్శన, పరిస్థితులకు అనుగుణంగా మారే సామర్థ్యంపై సమగ్ర సమీక్ష జరుగుతోందని అన్నారు. మెల్‌బోర్న్ టెస్ట్‌లో గెలుపు లాంటి కొన్ని సానుకూల ఘట్టాలు ఉన్నప్పటికీ, మొత్తం సిరీస్‌లో స్థిరత్వం లోపించిందని ఆయన అంగీకరించారు.
బ్రెండన్ మెకల్లమ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంగ్లండ్ 46 టెస్టుల్లో 26 విజయాలు సాధించింది. ఇందులో పాకిస్థాన్‌లో 3–0 వైట్‌వాష్ వంటి చారిత్రాత్మక విజయాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా నాలుగో యాసిస్ పరాజయం ఈ ప్రయాణానికి పెద్ద అడ్డంకిగా మారింది. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2025–27 సైకిల్‌లో ఇంగ్లండ్ ఏడో స్థానంలో ఉంది.
రాబోయే షెడ్యూల్‌ను చూస్తే ఇంగ్లండ్ జూన్‌లో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్, ఆ తర్వాత పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ పర్యటనలు ఉన్నాయి. అలాగే ఫిబ్రవరిలో టీ20 ప్రపంచకప్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో స్టోక్స్–మెకల్లమ్ జోడీపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది. యాసిస్ పరాజయం బజ్‌బాల్‌కు ముగింపు కాకపోయినా, దాని పరిణామంపై గట్టి విరామం మాత్రం ఖాయం. ఇంగ్లండ్ ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలిచింది. దూకుడు విధానాన్ని పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేస్తుందా? లేక అదే ఫార్ములాతో ముందుకు వెళ్లి మరిన్ని పరాజయాలను ఆహ్వానిస్తుందా? అన్నది రాబోయే కాలంలో తేలనుంది.