Business Headlines 28-02-23:
అమరరాజా ఆర్ అండ్ డీ
అమరరాజా బ్యాటరీస్ సంస్థ.. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ని ఏర్పాటుచేయనుంది. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలో ఉన్న జీఎంఆర్ ఏరోసిటీలో ఈ ‘‘ఆర్ అండ్ డీ’’ కేంద్రాన్ని అందుబాటులోకి తేనుంది. ఇ-హబ్ పేరుతో సుమారు ఏడెకరాల విస్తీర్ణంలో నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు తమ గిగా కారిడార్ ప్రోగ్రామ్‌లో భాగమని అమరరాజా కంపెనీ తెలిపింది. ఈ కార్యక్రమం విలువ 9 వేల 500 కోట్ల రూపాయలని పేర్కొంది. ఇదిలాఉండగా.. అమరరాజాతో కలిసి ప్రయాణించటం తమ సంస్థ ప్రస్థానంలో ఒక కీలకమైన మైలురాయి అని జీఎంఆర్ ఏరోసిటీ హర్షం వ్యక్తం చేసింది.
విష్ణు కెమికల్స్ పెట్టుబడి
ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్‌లలో చేపట్టనున్న కంపెనీ విస్తరణ ప్రణాళికలను విష్ణు కెమికల్స్ వెల్లడించింది. ఈ రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టుల అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చుచేయనున్నట్లు తెలిపింది. వివిధ రంగాల్లో పెట్టనున్న ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ వల్ల మరియు తమ ఉత్పత్తుల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది జీవితాలు ప్రభావితం కానున్నాయని ఆశాభావం వెలిబుచ్చింది. రానున్న ఐదు సంవత్సరాల్లో ప్రత్యేక రసాయనాల సమీకృత కర్మాగారాన్ని నెలకొల్పనుంది. పిగ్మెంట్స్, డైస్, ప్లేటింగ్, ఫార్మాస్యుటికల్స్, కన్‌స్ట్రక్షన్, గ్లాస్, ఉడ్ స్టోరేజ్ కోసం వాడే ప్రిజర్వేటివ్స్ మరియు ఆటోమొబైల్ సెక్టార్లలో పెట్టుబడులు పెట్టనుంది.
ఫిక్కీ సెక్రటరీ జనరల్‌గా
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ.. ఫిక్కీ.. నూతన సెక్రటరీ జనరల్‌గా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ శైలేష్ పాఠక్ నియమితులయ్యారు. రేపటి నుంచి.. అంటే.. మార్చి ఒకటి నుంచి పగ్గాలు చేపట్టనున్నారు. శైలేష్ పాఠక్ 37 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఐఏఎస్ అధికారిక బాధ్యతలతోపాటు పెద్ద పెద్ద ప్రైవేట్ సంస్థల్లో విధులు నిర్వర్తించారు. ఆయనకే సొంతమైన ఈ సుదీర్ఘ అనుభవం ఫిక్కీకి ఎంతగానో తోడ్పడుతుందని భావిస్తున్నారు. మరో వైపు.. ఫిక్కీ డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా ఈ ఏడాది జూన్ 30న రిటైర్ కానున్నారు. అనంతరం సలహాదారుగా వ్యవహరిస్తారని ఫిక్కీ పేర్కొంది.
శ్యామ్ స్టీల్ ప్రచారకర్త
శ్యామ్ స్టీల్ ఇండస్ట్రీస్ ఉత్పత్తులకు ప్రచారకర్తగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని సంస్థ డైరెక్టర్ లలిత్ బెరివాలా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపెనీ విస్తరణ ప్రణాళికను వెల్లడించారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 500లకు పైగా డీలర్ డిస్ట్రిబ్యూటర్లను ఏర్పాటుచేస్తామని తెలిపారు. ప్రొడక్షన్ కెపాసిటీని ఇప్పుడున్న 7 లక్షల టన్నుల నుంచి పదమూడున్నర లక్షల టన్నులకు పెంచుతామని చెప్పారు. ముందుగా ఏపీ, తెలంగాణల్లో రిటైల్ కార్యకలాపాలను విస్తరించి, అనంతరం.. సౌత్ ఇండియాలో నెట్‌వర్క్‌ను పెంచుకోనున్నట్లు వివరించారు.
యాడ్స్ ఇలా ఉండాలి
వాణిజ్య ప్రకటనకర్తలకు, తయారీదారులకు, సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రకటనలు వినియోగదారులను పక్కదోవ పట్టించేలా ఉండకూడదని సూచించింది. అడ్వర్‌టైజ్‌మెంట్లను హ్యాష్‌ట్యాగ్‌లతో మరియు లింకులతో నింపకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా యాడ్స్ ఇచ్చేవాళ్లు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచించారు.
అదానీ బాటలో అనిల్
వేదాంత రిసోర్సెస్ కంపెనీ యజమాని అనిల్ అగర్వాల్ అప్పుల తిప్పలు పడుతున్నారని వార్తలొస్తున్నాయి. గౌతమ్ అదానీ మాదిరిగానే అనిల్ అగర్వాల్ సంస్థ షేర్ల విలువ కూడా మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉందని అమెరికా అనాలసిస్ సంస్థ ‘ఎస్ అండ్ పి’ అలర్ట్ చేసింది. ఒకానొక దశలో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నమోదైన వేదాంతా కంపెనీ ఇప్పుడు రుణాల ఊబిలో చిక్కుకుందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు తీర్చాల్సిన రుణాలు మరియు బాండ్ల కోసం అనిల్ అగర్వాల్ చేస్తున్న నిధుల సమీకరణ యత్నాలకు ఆటంకాలు ఎదురవుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.